సిమ్లాలో హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు టీకా ఇస్తున్న నర్సు
పుణే/ న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఇటీవల కోవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కోవిడ్ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. శుక్రవారం సాయంత్రం దీనికి సంబంధించిన ఆదేశాలు విడుదల కాగా, అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా ఆంక్షల ప్రకారం.. మార్చి 31 వరకూ పాఠశాలు, కాలేజీలను మూసివేయనున్నారు. ఫుడ్ డెలివరీలు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే సాగనున్నాయి. రెస్టారెంట్లు, ఇతర కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 50 శాతం సీటింగ్‌ను మాత్రమే నింపాలి. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు. పెళ్లిళ్లు, మరణాలు, రాజకీయ ప్రచారాలు వంటి కార్యక్రమాలకు 50 మందిని మించి హాజరు కారాదు. పార్కులు సాయంత్రం పూట మూసివేయనున్నారు. ఐసోలేషన్ సెంటర్ల సంఖ్యలను పెంచనున్నారు. హోం ఐసోలేషన్‌ను నిశితంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
23,285 కరోనా కొత్త కేసులు
దేశంలో గత 24 గంటల్లో 23,285 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. 78 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,08,846కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 117 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,58,306కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,09,53,303కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,97,237గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment