![Rajasthan Honour of Dead Body Bill, 2023: Rajasthan House passes Honour of Dead Body Bill - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/ASSEMBLY-ACT.gif.webp?itok=4V6mbIqu)
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
చట్టంలో ఉన్నదిదీ...!
మరణానంతరం హక్కులుంటాయ్!
ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు.
మృతదేహాలతో నిరసన కుదరదు
ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు.
ఎందుకీ చట్టం?
రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి.
అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది.
ఆ మృతదేహాలు పదిలం
ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి.
పెనాల్టీ
మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది
డేటా బ్యాంకు
ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment