
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నుంచి బుధవారం తుది తీర్పు వెలువడనుంది. నళిని శ్రీహరన్, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు అనుకూలమైన తీర్పుకు మార్గం సుగమం కానున్నట్లు సమాచారం. రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు.
ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 సంవత్సరాలు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షతో ఏకీభవించింది కానీ 2014లో దానిని జీవిత ఖైదుగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో, ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కొంతకాలం తర్వాత, పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. పెరారివాలన్ అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది, కానీ తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు సూచించినప్పటికీ ఇంతవరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు.
ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదీలుగా మార్చింది.
చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే: తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా
Comments
Please login to add a commentAdd a comment