ముంబై : టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఆంగ్ల వార్తాచానెనల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ అయిన ఏఆర్‌జీ ఔట్‌లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు, హంస రీసెర్చ్ గ్రూప్ ఉద్యోగులకు గతంలో కల్పించిన తాత్కాలిక ఊరటను కూడా జనవరి 29 వరకు కోర్టు పొడగించింది. ఆ ఉద్యోగులను వారానికి రెండు సార్లకు మించి విచారణకు పిలవకూడదని కోర్టు గతంలో ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌జీ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. టీఆర్పీ కోసం అర్నబ్ గోస్వామి లంచం ఇచ్చారని ముంబై పోలీసులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని సాల్వే వాదించారు.
మరోవైపు, ఈ టీఆర్పీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా నగదు అక్రమ చలామణీ కేసును నమోదు చేసి, విచారణ చేస్తోందని కోర్టుకు తెలిపారు. ఈడీ నమోదు చేసిన కేసు స్టేటస్ రిపోర్ట్‌ను కూడా కోర్టు తెప్పించుకోవాలని కోరారు. ఈడీ నివేదికకు, ముంబై పోలీసుల నివేదికకు మధ్య తేడాలున్నట్లయితే.. ఏఆర్‌జీపై దురుద్దేశంతో కేసు పెట్టినట్లు అర్థమవుతుందని వివరించారు. నివేదిక సీల్డ్ కవర్‌లో అందించేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనను ముంబై పోలీసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఈ కేసులో ఆర్థిక అక్రమాలపై వాదించే ఈడీకి భాగస్వామ్యం కల్పించడం సరికాదన్నారు. ఇప్పటివకు ఈడీ ఈ కేసులో భాగస్వామిగా లేదని వాదించారు. కేసులో భాగస్వామి కాకుండానే, స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని ఈడీ ఎందకంత ఉత్సాహం చూపుతోందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment