సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
ఏం అవకాశం ఉన్నట్టు?
ఈ ట్వీట్ చేయడం వల్ల నేను విమర్శలను ఆహ్వానిస్తున్నానని తెలుసు, అయినా దీన్ని గట్టిగా చెప్పాలనిపించింది. నిన్న ఒక కుటుంబంతో ఒక పాపను గమనించాను. పుణెలోని ఒక ధనిక మార్కెట్ ప్రాంతం అది. కచ్చితంగా పాప తొమ్మిది, పది నెలలకు మించి ఉండదు. తనకు హిజాబ్ వేసివుంది. ఈ సందర్భంలో పాపకు ఏం అవకాశం ఉన్నట్టు? నేను హిజాబ్ నిషేధాన్ని సమర్థించడం లేదు. కానీ అంత చిన్న పాపకు వేయడం అనే విషయంలో మాత్రం ఏదో తప్పుగా ఉంది.
– రిచా సింగ్, రచయిత్రి
కుడి ఎడమల వైఖరులు
మెట్రోలో నాకు ఎడమ వైపున ఒక ఢిల్లీ పోలీస్ అంకుల్ కూర్చుని వాట్సాప్‌లో కాంగ్రెస్ పార్టీ మీద జోక్ చదువుతున్నాడు. నాకు కుడి వైపున బహుశా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అనుకుంటాను, లెనిన్ పుస్తకం చదువుతున్నాడు. జీవితంలో బహుశా మొదటిసారి నేను లెఫ్ట్ కంటే ‘రైట్’కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను.
– కె. స్వాతి, ఢిల్లీ హైకోర్ట్ అడ్వకేట్
ప్రతీకార రాజకీయాలు
పశ్చిమ బెంగాల్‌లో ఒక్క వారంలో 26 రాజకీయ హత్యలు జరిగాయి. వీర్‌భూమ్ నరమేధంలో 12 మంది మహిళలు, పిల్లల్ని తగలబెట్టి చంపారు. ఇరవై నాలుగ్గంటల క్రితం వాళ్లు బతికున్నారు. ఒక తృణమూల్ నాయకుడి హత్యకు ప్రతీకారంగా జరిగిన హింస ఇది. మమతా బెనర్జీ పాలిత బెంగాల్‌లో ఇది నిత్యకృత్యమైపోయింది.
– అభిజిత్ మజుందార్, సంపాదకుడు
ఇంత హింసా?
నిజాయితీ లేని మేధావితనం ఒక రాష్ట్రానికీ, దాని ప్రజలకూ ఏం చేయగలదో చూడాలంటే, పశ్చిమ బెంగాల్‌లో ఏం జరుగుతున్నదో గమనించండి. కనీసం అక్కడ జరిగిన నరమేధపు ఫొటోలను ట్వీట్ చేయడానికి కూడా నాకు చేతులు రావడం లేదు.
– రణ్‌వీర్ షోరే, నటుడు
ఎలా మద్దతివ్వగలం?
వ్లాదిమిర్ పుతిన్‌ను ఓడించడానికి ఉక్రెయిన్‌లోని నాజీలతో జట్టుకట్టడం ఎంత అసంబద్ధ మంటే... పుతిన్‌ను ఓడించడానికి సిరియాలోని ఐసిస్‌తో జట్టుకట్టడంతో అది సమానం.
– మాజిద్ నవాజ్, యాక్టివిస్ట్
ఎందుకింత వేగం?
కిరాణా సామగ్రి పది నిమిషాల్లో డెలివరీ... పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ... అదీ భారతీయ నగరాల్లో? నిజంగా ఈ డెలివరీ బాయ్స్ జీవితాలు, వాళ్ల రక్తపోట్ల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా?
– షెఫాలీ వైద్య, పాత్రికేయురాలు
ఎందుకు రావడం?
రీడింగ్ రూమ్‌కు వచ్చి అట్లానే పూర్తి నిద్రలోకి జారుకునేవాళ్లు నాకు ఎప్పుడూ అర్థం కారు. ప్రతి టేబుల్ మీదా ఒక తల పెట్టివుంది.
– జాకబ్ బర్న్‌హామ్, పరిశోధక విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment