వేలూరు(తిరువణ్ణామలై): కరోనా నుంచి కాపాడాలని రాగి, వేప చెట్లకు వివాహం చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్ ఆలయం ఉంది. పదేళ్ల కిందట గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి, కుంభాభిషేకం చేశారు. ఆ సమయంలో ఒక మహిళపై అమ్మవారు వాలి, ఆలయం ఉన్న ప్రాంతంలో రాగి–వేప చెట్లను నరకవద్దని ఈ చెట్లు రెండూ దేశ ప్రజలను కాపాడుతాయని చెప్పినట్లు గ్రామపెద్దల ద్వారా తెలుస్తోంది.
ఈ క్రమంలో భక్తులు ప్రతి రోజూ ఈ చెట్లకు పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అదే మహిళపై అమ్మవారు మళ్లీ వాలి, దేశంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండేందుకు వేప, రాగి చెట్లకు వివాహం చేయాలని తెలిపింది. దీంతో గ్రామస్తులు పెళ్లి పత్రికలు కొట్టి, గ్రామంలో పంచి పెట్టి ఆలయ ప్రాంగణంలో అరటి చెట్లు కట్టి, పందిళ్లు వేసి రెండు చెట్లను కొత్తదుస్తులతో అలంకరించారు. శనివారం ఉద యం 6 గంటల సమయంలో మేళ తాళాల నడుమ వరుస తాంబూలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు.
వేద పండితుల ఆధ్వర్యంలో తాంబూలం మార్చుకుని సంప్రదాయం ప్రకారం బంగారం తాళి బొట్టును వేప చెట్టుకు కట్టి వివాహం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అక్సిజన్ ఉత్పత్తి పెరిగేందుకు చెట్లను పెంచాలని, మానవుడి తరహాలోనే చెట్లును రక్షించాలని, ప్రపంచ శాంతి కోసం,వేప–రాగి చెట్టుకు వివాహం చేయడంతో పలువురిని ఆశ్చర్యపరిచింది. వివాహ అనంతరం గ్రామస్తులందరికీ వివాహ వేడుకల తరహాలోనే విందు ఏర్పాటు చేశారు.
చదవండి: యూకేలో 49శాతం వ్యాక్సినేషన్‌తో 97% తగ్గిన కేసులు
Comments
Please login to add a commentAdd a comment