సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ ఈనెల 7న బెంగళూరు నుంచి చెన్నైకి రావడం ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని గత నెల 27న విడుదలైన శశికళ కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. గతనెల 31న ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన నాటి నుంచి బెంగళూరు శివార్లలోని లగ్జరీ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నుంచి బైటపడినా వారంరోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. దీంతో ఈనెల 7న ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోవడం ఖరారైంది. 7వ తేదీ ఉదయం 7.30 గంటలకు బెంగళూరులో బయలుదేరి కర్ణాటక–తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లి వద్ద ఆమెకు ఘనస్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: వచ్చే ప్రభుత్వంలో శశికళ కీలక పాత్ర
అమ్మ సమాధికి అడ్డంకి..
బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోగానే నేరుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిని దర్శించుకుని తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించేలా శశికళ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే జయ సమాధికి తుదిమెరుగుల పనులు కొనసాగుతున్న కారణంగా సందర్శనకు 15 రోజులపాటు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో శశికళకు కూడా దర్శించే అవకాశం లేకుండాపోయింది. 2017, ఫిబ్రవరి 24న అరెస్ట్ కాగానే నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ ఆవేశంతో అరచేతితో మూడుసార్లు సమాధిపై చరచడం పెద్ద చర్చనీయాంశమైంది. నేడు జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నేరుగా సమాధి వద్దకు చేరుకుంటే ఎలాంటి వ్యవహరశైలిని ఆమె అనుసరిస్తారో అనే అనుమానంతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment