సాక్షి, ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే వర్గం, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది సూచనప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చామని, వచ్చే ఎన్నికల్లో శిండే వర్గంతో కలిసే పోటీచేయనున్నట్లు బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్‌కుళే వెల్లడించారు. ఇరువురం కలిసి 200 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సీట్ల పంపకాలు, సర్దుబాట్లపై పలు చర్చలు జరుపుతామని ఆ తర్వాతే తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని భావన్ కుళే శనివారం మీడియాకు చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా అందులో బీజేపీ 240, శివసేన (శిండే వర్గం) 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బావన్‌కుళ్లే తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్న నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం సమయం అన్ని పారీ్టలకు ఉండగా...శిందే, బీజేపీ శిబిరంలో మాత్రం ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది.
ఎంవీఏ ఒప్పందంతో మొదలైన వేడి
మహా వికాస్ ఆఘాడి నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఫార్మూలా రూపొందించిన విషయం తెలిసిందే. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో శివసేన 21, ఎన్సీపీ 19, కాంగ్రెస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిండే, ఫడ్నవీస్ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏక్‌నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మొదటి ప్రసంగంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మేం, బీజేపీ కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇరువురం కలిసి 200 స్థానాల్లో గెలుస్తామని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
వైరల్ అవుతోన్న భావన్ కుళే వ్యాఖ్యలు
ఇదిలాఉండగా చంద్రశేఖర్ భావన్ కుళే మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో పోటీ చేస్తుందని, దీంతో కార్యకర్తలందరూ ఇప్పటి నుంచి అప్రమత్తమై, పనుల్లో నిమగ్నం కావాలని సూచించినట్లు ఉంది. అంటే శిండే వర్గానికి కేవలం 48 స్థానాలు లభిస్తాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. భావన్ కుళే వ్యాఖ్యలపై శిండే వర్గానికి చెందిన సంజయ్ శిర్సాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనకు ఎంత వరకు మాట్లాడే అధికారముందో అంతే మాట్లాడాలని అంతకుమించి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్ల పంపకంపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, ఇది కేవలం భావన్ కుళే అభిప్రాయమని స్పష్టం చేసి ఈ అంశానికి అక్కడితో తెరదించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించామని శిర్సాట్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీట్ల పంపకంపై పలుమార్లు చర్చలుంటాయని, ఆ తర్వాత తుది నిర్ణయానికి రాగానే అధికారికంగా జాబితా వెల్లడిస్తామని తెలిపారు. అప్పటివరకు అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు సర్దుబాటు ఫార్మూలాపై వచ్చిన ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment