Sikh man From India Emotional Reunion With His Pak Family - Sakshi
Sakshi News home page

వీల్‌ఛైర్‌లో ఎదురుచూపులు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం, సినిమాకు ఏమాత్రం తీసిపోని యధార్థ ఘటన

Published Fri, Sep 9 2022 8:30 PM | Last Updated on Fri, Sep 9 2022 8:56 PM

Sikh man From India Emotional Reunion With His Pak Family - Sakshi

ఛండీగఢ్‌: అనాథలా రోడ్ల వెంట తిరుగుతూ ఆ చిన్నారి.. ఆ భార్యభర్తల కంటపడ్డాడు. పిల్లలు లేని ఆ జంట.. భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి పెంచుకున్నారు. కడుపున పుట్టకున్నా.. సొంత బిడ్డగా ప్రేమను పంచింది ఆ తల్లి. విధివశాత్తూ 75 ఏళ్ల తర్వాత తనకంటూ రక్తసంబంధీకులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని.. కలుసుకుని కన్నీరుమున్నీరు అయ్యాడు ఆ వ్యక్తి.

1947.. దేశ విభజన సమయంలో అమర్‌జిత్‌ సింగ్‌(అప్పటి పేరు తెలియదు) కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. ఆ సమయంలో కొంత మందినే బృందాల వారీగా అనుమతించడంతో.. పసికందులను వెంటపెట్టుకుని, మిగిలిన ఒక్క కొడుకును మాత్రం జలంధర్‌లోని పబ్వాన్‌ గ్రామంలో ఉన్న తన అన్న దగ్గర వదిలేసి వెళ్లింది ఆ తల్లీ. తన అన్న కుటుంబంతో కలిసి తన బిడ్డ పాక్‌కు వస్తాడని, తనను చేరుకుంటాడని అనుకుంది. కానీ.. 

పరిస్థితుల ప్రభావంతో.. ఆ అన్న భారత్‌ దాటలేకపోయాడు. ఆపై అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో అతని కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. పబ్వాన్‌లోనే తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ పసికందు అనాథలా రోడ్డునపడ్డాడు. అయితే నూర్‌మహల్‌ ప్రాంతంలో ఉండే ఓ సిక్కు కుటుంబం అతన్ని అక్కున చేర్చుకుంది. పిల్లలు లేకపోవడంతో అమర్‌జిత్‌ సింగ్‌ అని పేరు పెట్టి.. పెంచుకుంది. అలా.. ఆ ఇంటి బిడ్డగానే పెరుగుతూ వచ్చాడు ఆ వ్యక్తి. 

అయితే.. మమకారంతో పెంచి పెద్ద చేసిన తల్లి చనిపోయే ముందు సొంత కొడుకు కాదనే అసలు విషయం చెప్పింది. దీంతో తనవారెవరో తెలియక.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పబ్వాన్‌లో ఆరా తీయడం మొదలుపెట్టాడు అమర్‌జిత్‌ సింగ్‌. చనిపోయిన తన మేనమామ గురించి వివరాలు తెలిసినా.. ఆ కుటుంబ సభ్యులు ఏమైపోయారనే విషయం మాత్రం తెలీయకుండా పోయింది. ఈ లోపు.. వయసు పైబడి వీల్‌చైర్‌కు అంకితమైపోయాడు అమర్‌జిత్‌. తన పూర్వీకుల కోసం ఆ పెద్దాయన చేస్తున్న ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు తోడైనా కూడా లాభం లేకుండా పోయింది. ఈలోపు..  

పాక్‌ నుంచి ఓ జర్నలిస్ట్‌.. పబ్వాన్‌లో ఉంటున్న ఉద్యమకారుడు హాన్స్‌ రాజ్‌కు ట్విటర్‌ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చాడు. ఫలానా వ్యక్తి అంటూ అమర్‌జిత్‌ మేనమామ గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో అమర్‌జిత్‌ కాంటాక్ట్‌ను సంపాదించడంతో.. అవతల ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బుధవారం కార్తార్‌పూర్‌ గురుద్వార దగ్గర అమర్‌జిత్‌ సింగ్‌ పాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళను కలిశాడు. ఆమె ఎవరో కాదు.. ఆయన సోదరి(చెల్లి) కుల్సుం. తాను పాక్‌కు వలస వెళ్లాక పుట్టానని, తల్లి ఏనాడో చనిపోయిందని.. అక్క కూడా ఆమధ్య చనిపోతూ సోదరుడి విషయం చెప్పిందని, అలా తన బంధం కోసం వెతుకుంటూ వచ్చానని ఖుల్సుం వివరించింది. 

పాక్‌కు చేరుకున్న అమర్‌జిత్‌ తల్లి.. తన భర్త స్నేహితుడైన దారా సింగ్‌ అనే వ్యక్తి ద్వారా ఆ చిన్నారి కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందట. దీంతో ఆమె కొడుకు ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంటాడని ఆశిస్తూ ఇన్నేళ్లు గడిపింది. ఏదేమైతేనేం మొత్తానికి.. రక్తసంబంధం కలిసింది.. ఈ కథ పలువురిని కదిలించింది కూడా. 

ఇదీ చదవండి: అసాధ్యం అనుకుంటే.. సుసాధ్యం చేసిందామె!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement