అవి పేలితేనే మా కడుపులు నిండేది! | Sivakasi Stares At Dark Diwali | Sakshi
Sakshi News home page

బాణాసంచా విక్రయాల నిషేధంపై కార్మికుల ఆవేదన

Published Thu, Nov 12 2020 5:51 PM | Last Updated on Thu, Nov 12 2020 6:14 PM

Sivakasi Stares At Dark Diwali  - Sakshi

చెన్నై : బాణాసంచా హబ్‌గా పేరొందిన శివకాశిలో ఇప్పుడు దీపావళి జోష్‌ కనబడటం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా అమ్మకాలను నిషేధించడంతో శివకాశి కళ కోల్పోయింది. తమిళనాడులోని విరుద్‌నగర్‌ జిల్లాలోని చిన్న పట్టణం శివకాశిలో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా బాణాసంచా తయారీతో ముడిపడిఉంది. శివకాశిలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరికీ బాణాసంచా అమ్మకాలకు సంబంధించి ప్రతి భవనంపైనా భారీ బ్యానర్లు కనిపిస్తాయి. పట్టణ ప్రజలకు భారీ డిస్కౌంట్‌పై బాణాసంచాను విక్రయిస్తుంటారు.

బాణాసంచాపై నిషేధం ఇక్కడి కార్మికులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. శివకాశిలో ప్రతి 12 మీటర్ల దూరంలో ఒక బాణాసంచా తయారీ యూనిట్‌ ఉంటుంది. వీటిలో ప్రతి చిన్న గదిలో కనీసం నలుగురు మహిళలు వాయువేగంతో తమకు కేటాయించిన పనులను చక్కబెడుతుంటారు. వీరిలో చాలా మంది తమ చిన్నతనం నుంచే బాణాసంచా పరిశ్రమలో పనిచేస్తుండగా మరికొందరు 18 సంవత్సరాల వయసు నుంచే ఈ వృత్తిలో పనిచేస్తున్నారు. భానుమతి అనే మహిళ బాణాసంచా తయారీనే వ్యాపకంగా మలుచుకుని తన నలుగురు పిల్లలను ఉన్నత విద్య చదివించారు. 


ప్రాణాలు పణంగా పెట్టి..
బాణాసంచా తయారీ పరిశ్రమలో పనిచేయడం ప్రాణాలకు ముప్పని తెలిసినా జీవనోపాధికి మరోదారి లేదని మహిళలు చెబుతున్నారు. తరచూ పేలుళ్లు జరుగుతున్నా తాము ఈ పని కొనసాగిస్తున్నామని, ఎంతోమంది ప్రమాదాల్లో తమ పిల్లలను కోల్పోయినా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తనకు పెళ్లయినప్పటి నుంచి బాణాసంచా తయారీలో నిమగ్నమయ్యానని నలుగురు పిల్లలు కలిగిన ముతుమరి అనే మహిళ చెప్పుకొచ్చారు. తన భర్త ఎనిమిదేళ్ల వయసు నుంచే ఈ వృత్తిలో ఉన్నారని ఇప్పుడు తామిద్దరం నెలకు 16,000 రూపాయల వరకూ ఆర్జిస్తామని తెలిపారు. బాణాసంచా అమ్మకాలు ఆగితే తమ జీవనాధారం కుప్పకూలుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణమ్మాల్‌ అనే మరో మహిళ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బాణాసంచా తయారీ పనులు చేస్తూ తాను తన కుమార్తెను పెంచి పెద్దచేశానని, వికలాంగుడైన తన భర్త సైతం ఇదే పనిచేస్తారని చెప్పారు. తమ ఉపాథి కోల్పోతే తాము బతికేపరిస్థితి లేదని కన్నీటి పర్యంతమయ్యారు. బాణాసంచా ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిలో 80 శాతం మంది మహిళలే. బాణాసంచా పరిశ్రమ దెబ్బతింటే విరుద్‌నగర్‌ జిల్లాలో 8 లక్షల మందికిపైగా కార్మికులు ఉపాధి కోల్పోతారు. 


కరోనా కష్టాలు
ఈ ఏడాది కరోనా వైరస్‌తో బాణాసంచా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. కరోనా సమయంలో తాము రేషన్‌ బియ్యంతో నెట్టుకొచ్చామని, మరే పనులు లేక అప్పుల పాలయ్యామని ముతుమరి అనే మహిళ వాపోయారు. ఇక​ ఈ ఏడాది కరోనా మహమ్మారితో 40 నుంచి 45 శాతం వరకూ బాణాసంచా ఉత్పత్తి పడిపోయిందని ఆయన్‌ ఫైర్‌వర్క్స్‌ ఎండీ అబిరుబన్‌ వెల్లడించారు. దివాళీ సీజన్‌లో బాణాసంచా అమ్మకాలు సన్నగిల్లడంతో బాణాసంచా పరిశ్రమ గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌తో రెండు నెలల పాటు తమ ఫ్యాక్టరీలను మూసివేశామని చెప్పారు. బాణాసంచా అమ్మకాలపై పలు రాష్ట్రాలు నిషేధం విధించడంతో తమ వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement