Supreme Court security compromised: Solicitor General over Yasin Malik's appearance - Sakshi
Sakshi News home page

పిలవకున్నా సరే.. యాసిన్‌ మాలిక్‌ ప్రాణం పోతే ఎలా? కేంద్ర హోంశాఖకు ఘాటు లేఖ

Published Sat, Jul 22 2023 9:46 AM | Last Updated on Sat, Jul 22 2023 10:09 AM

Solicitor General Displeasure Over Yasin Malik Court Presence - Sakshi

ఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న అభియోగాలతో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్‌ మాలిక్‌ ఉన్నపళంగా కోర్టులో ప్రత్యక్షం కావడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  వర్చువల్‌గా విచారించే అవకాశం ఉన్నా.. కోర్టుకు తీసుకురావడం ఏంటని? జైలు అధికారులను ప్రశ్నించింది. అదే సమయంలో సోలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ అంశంపై కేంద్ర హోం శాఖకు ఓ ఘాటు లేఖ సైతం రాశారు.

ఆదేశాలు ఇవ్వకున్నా సరే.. యాసిన్‌ మాలిక్‌ను అధికారులు విచారణకు తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో జీవిత ఖైదు పడిన యాసిన్‌ మాలిక్‌ ప్రస్తుతం ఢిల్లీ తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తోటి ఖైదీల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలోనూ అతన్ని ప్రత్యేకంగా ఉంచారు కూడా. అలాంటిది.. 

వర్చువల్‌గా విచారించే ఛాన్స్‌ ఉన్నా..
జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన ఓ అభ్యర్థన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జైలు అధికారులు యాసిన్‌ మాలిక్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. చుట్టూ అధికారులున్నా.. మాలిక్‌ కోర్టు ప్రాంగణంలోనే కాసేపు కలియ తిరిగాడు. అయితే.. మాలిక్‌ను కోర్టులో భౌతికంగా హాజరుపర్చాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలుస్తోంది. 

ఇదే విషయాన్ని.. సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వర్చువల్‌గా విచారించే అవకాశం ఉంది కాదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అందుకు వీలున్నా  జైలు అధికారులు ఆ పని చేయలేదని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ వివరించారు.  ‘‘ఇది భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది. యాసిన్‌ మాలిక్‌ ప్రాణాలకు సంబంధించిన అంశం ఇది. భవిష్యత్తులో అతన్ని బయటకు తీసుకురాకపోవడమే మంచిది’’ అని తెలిపారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని.. సంబంధిత బెంచ్‌ నుంచి ఆదేశాలు పొందాలని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తలతో కూడిన బెంచ్‌ అదనపు సోలిసిటర్‌ జనరల్‌కు సూచించింది. 

హోం శాఖకు లేఖ
యాసిన్‌ మాలిక్‌ను జైలు నుంచి బయటకు తీసుకువస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  సోలిసిటర్‌ జనరల్‌​ తుషార్‌ మెహతా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు ఓ ఘాటు లేఖ రాశారు. 

యాసిన్‌ మాలిక్‌కు పాక్‌ సంబంధిత ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అతనెంత కీలకమో హోంశాఖకు తెలుసు. ఇలా బయటకు తీసుకొస్తే.. అతను తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే అతన్ని ఎత్తుకెళ్లడమో కుదరకుంటే చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సర్వోన్నత న్యాయస్థానం భద్రతకు సంబంధించిన అంశం కూడా. జైలు అధికారులకు అతన్ని బయటకు తీసుకొచ్చే అధికారం ఉండదన్న విషయం గుర్తించాలి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని తుషార్‌ మెహతా లేఖలో పేర్కొన్నారు. 

మరోవైపు ఈ ఘటనపై తీహార్‌ జైలు డీజీ విచారణకు ఆదేశిస్తూ.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోరారు.  సుప్రీం కోర్టు నుంచి నిత్యం ఇలాంటి నోటీసులు సర్వసాధారణంగా వెళ్తుంటాయని.. అయితే జైలు అధికారులు వాటిని తీవ్రంగా పరిగణించినందునే మాలిక్‌ను కోర్టుకు తీసుకెళ్లి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

1989లో నలుగురు ఐఏఎఫ్‌ సిబ్బందిని హతమార్చడంతో పాటు అప్పటి కశ్మీర్‌ హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయ్యద్‌ కూతురు రుబియాను అపహరించిన వ్యవహరానికి సంబంధించిన కేసులో యాసిన్‌ మాలిక్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాల్సి ఉంది. 

అయితే.. యాసిన్‌ మాలిక్‌ విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 268 ఆదేశాలు ఉన్నాయి. అంటే.. కోర్టులో అతన్ని హాజరుపర్చడం నుంచి మినహాయింపు ఉంది. కానీ, జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక కోర్టు(టాడా కోర్టు) అదనపు సెషన్స్‌  జడ్జి నిర్లక్ష్యంగా హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలనే సవాల్‌ చేస్తూ.. సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement