సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
► తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 3 వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తున్నాం. రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. పది రోజుల్లోగా తొలి భేటీ జరుగుతుంది. రెండు నెలల్లోగా సుప్రీంకు సిఫారసులతో నివేదికను అందిస్తుంది. సాగు చట్టాలపై ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల వాదనలను కమిటీ సభ్యులు వింటారు. తాజా ఉత్తర్వులతో రైతులు నిరసన విరమించి స్వస్థలాలకు వెళ్తారని ఆశిస్తున్నాం.
సభ్యులు వీరే..
► ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపేందర్ సింగ్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియా విభాగం డైరెక్టర్ ప్రమోద్ కుమార్, వ్యవసాయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు అశోక్ గులాటీ, షెట్కారీ సంఘ టన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్.
రైతుల వాదన..
► సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు విధించిన స్టేను స్వాగతిస్తున్నాం. అయితే కమిటీలోని సభ్యులు గతంలో ఈ చట్టాలకు మద్దతిస్తూ మాట్లాడారు. అలాంటి వ్యక్తులు రైతులకు ఎలా న్యాయం చేస్తారు?. అందుకే వారి ముందు మా వాదన వినిపించం. చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం కొనసాగుతుంది.
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుపై మంగళవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చట్టాలు అమల్లోకి రాకముందు ఉన్న కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతుందని వివరించింది. రైతుల సాగు భూమికి రక్షణ కొనసాగుతుందని, కొత్త చట్టాల వల్ల ఏ రైతు కూడా తన భూమిని కోల్పోడని పేర్కొంది. సాగు చట్టాల అమలుపై విధించిన స్టేను స్వాగతించిన రైతు సంఘాలు.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వ అనుకూలురని, వారి ముందు తమ వాదన వినిపించబోమని తేల్చిచెప్పారు. చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపేయాలని తాము చేసిన సూచనను పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంపై మండిపడిన విషయం తెలిసిందే. మీరు నిలిపేయనట్లయితే.. ఆ పని మేమే చేస్తామని కూడా హెచ్చరించింది. ఆ హెచ్చరికను నిజం చేస్తూ మంగళవారం సాగు చట్టాల అమలును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిలిపివేసింది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పది రోజుల్లోగా ఈ కమిటీ తొలి సమావేశం జరుగుతుందని, తొలి భేటీ నుంచి రెండు నెలల్లోగా సుప్రీంకోర్టుకు సిఫారసులతో కూడిన నివేదికను అందిస్తుందని వివరించింది. సాగు చ ట్టాలపై ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల వాదనలను కమిటీ సభ్యులు వింటారని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఇరు వర్గాలు సరైన స్ఫూర్తితో తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నామని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని ఈ సందర్భంగా రైతులపై అత్యున్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. తాజా ఉత్తర్వులతో రైతులు నిరసన విరమించి స్వస్థలాలకు వెళ్తారని ఆశిస్తున్నామని తెలిపింది. అనంతరం, విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది. సాగు చట్టాల రాజ్యాంగ బద్ధత, రైతుల ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీ ముందుకు వెళ్లం
సాగు చట్టాల అమలుపై విధించిన స్టేను స్వాగతించిన రైతు నేతలు.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోని సభ్యులు ప్రభుత్వానికి అనుకూలురని విమర్శించారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు వద్ద రైతు నేతలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆ సభ్యులను నమ్మలేం. వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనకరమని వారు ఇన్నాళ్లూ రాశారు. వారినెలా విశ్వసిస్తాం?’ అని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ప్రశ్నించారు. కమిటీని ఏర్పాటు చేయాలని తాము సుప్రీంకోర్టును కోరలేదని గుర్తు చేశారు. కోర్టు చర్యల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు. రైతు ఆందోళనల నుంచి ఈ విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సుమోటాగా సుప్రీంకోర్టు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. ఏ కమిటీ ముందు హాజరు కాబోమని మరో రైతు నేత దర్శన్ సింగ్ స్పష్టం చేశారు. జనవరి 15న ప్రభుత్వంతో జరిగే చర్చలకు హాజరవుతామని తెలిపారు. ‘కమిటీ ఏర్పాటులో సుప్రీంకోర్టును కొన్ని శక్తులు తప్పుదారి పట్టించాయి. కమిటీలోని సభ్యులు ఈ మూడు వ్యవసాయ చట్టాలను సమర్ధించేవారే కాదు, ఇలాంటి చట్టాలు కావాలని కోరినవారు కూడా’ అని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ విమర్శించింది.
సభ్యుల ఎంపిక తప్పు
వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఆందోళనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కమిటీ సభ్యుల ఎంపిక సరిగా లేదని వ్యాఖ్యానించింది. కమిటీలోని సభ్యులు గతంలో ఈ చట్టాలకు మద్దతిస్తూ మాట్లాడారని, వారు రైతులకు ఎలా న్యాయం చేస్తారని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ప్రశ్నించారు.
కమిటీ సభ్యులు ఎవరంటే..
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో ఇద్దరు రైతు నేతలు భారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మన్, షెట్కారీ సంఘటన్(మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్వత్.. ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులు ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దక్షిణాసియా విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయ రంగ పరిశోధనలో చేసిన కృషికి గానూ అశోక్ గులాటీకి 2015లో పద్మ శ్రీ పురస్కారం లభించింది. ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్‌కు 2011 నుంచి 2014 వరకు చైర్మన్‌గా ఉన్నారు.
ఈ కమిషన్ కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. 2001 నుంచి 2011 వరకు గులాటీ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, నాబార్డ్, ఎన్‌సీడీఈఎక్స్‌ల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యవసాయ రంగంపై 15కి పైగా పుస్తకాలు రాశారు. కమిటీలోని మరో సభ్యుడు ప్రమోద్ కుమార్ జోషి గతంలో హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్, ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనమిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్ సంస్థల్లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. రైతు నేత భూపీందర్ సింగ్ మన్ 1990–96 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
కమిటీలోని మరో రైతు నేత షెట్కారీ సంఘటన్(మహారాష్ట్ర) అధ్యక్షుడు అనిల్ ఘన్వత్. షెట్కారీ సంఘటన్ సాగు చట్టాలకు మద్దతిస్తున్న రైతు సంఘాలలో ఒకటిగా విమర్శలు ఎదుర్కొంటోంది. రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలని దివంగత శరద్ జోషి నాయకత్వంలోని షెట్కారీ సంఘటన్ చాన్నాళ్లు పోరాటం చేసింది. ‘కేంద్ర చట్టాలను మేం పూర్తిగా సమర్ధించడం లేదు. కమిటీలో సభ్యుడిగా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తాను’ అని ఘన్వత్ మంగళవారం వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment