సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఏం జరుగుతుంతో.. న్యాయవాదులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలకు తెలియజయడం కోసం మీడియాను తప్పనిసరిగా అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఈసీ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మీడియా చాలా శక్తిమంతమైందని.. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో దాన్ని బయటకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది.
కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా జనాలకు పట్టింపు ఉంటుందని సుప్రీం కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనల్ని మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమన్నది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ విజృంభణకు సంబంధించి ఈసీకి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే నిందిస్తున్నారని తెలిపింది. మద్రాస్ కోర్టు వ్యాఖ్యల అనంతరం ఎలాక్ట్రానిక్ మీడియాలో తన పని తీరును విమర్శిస్తూ.. వాదనలు నడుస్తున్నాయని ఈసీ కోర్టుకు తెలిపింది.
దీనిపై కోర్టు స్పందిస్తూ ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. హైకోర్టులను తక్కువ చేయడం తమకు ఇష్టం లేదని తెలిపారు. న్యాయవ్యవస్థకు అవి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. విచారణలో భాగంగా కొన్నిసార్లు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారని.. కోర్టును ఎలా నిర్వహించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.
చదవండి: ధర్మాగ్రహం
Comments
Please login to add a commentAdd a comment