
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిషన్‌కు మరో ఆరు నెలల గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దారుణంలో నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన ఘటనపై సుప్రీంకోర్టు గత డిసెంబర్ 12న న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని, కమిషన్ విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని నాటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.
దీని ప్రకారం ఆగస్టు 3తో నివేదిక సమర్పణకు గడువు ముగియనుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ న్యాయ విచారణ కోసం సమావేశాలు నిర్వహించలేకపోయిందని కమిషన్‌కు కౌన్సిల్‌గా ఉన్న న్యాయవాది కె.పరమేశ్వరన్ సుప్రీంకోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. కమిషన్ గడువు మరో ఆరు నెలలు పొడిగించాలని కోరారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కమిషన్ గడువును పొడిగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment