
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఒక దేశం.. ఒక రేషన్ కార్డును రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. సమస్యలను బూచిగా చూపించకుండా వలస కార్మికులకోసం పథకాన్ని అమలు చేయాలని పేర్కొంది. శుక్రవారం వలసకార్మికుల కష్టాలకు సంబంధించిన సుమోటో కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఒక దేశం.. ఒక రేషన్ కార్టు పథకాన్ని పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
తమ రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేయకపోవటానికి కారణం ఆధార్ సమస్యేనని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, రాజకీయ కారణాలతోనే పథకాన్ని అమలు చేయటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో సమస్య ఉందని, అందుకే ఒక దేశం.. ఒక రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయటం లేదని అన్నారు.