కోర్టులను ఎంతమాత్రం శాసించొద్దు
క్షేత్రస్థాయి కోర్టులను మేం నియంత్రించజాలం
అన్ని విషయాలను ట్రయల్ కోర్టు చూసుకుంటుంది
ఏం చేయాలో ఇప్పటికే స్పష్టంగా చెప్పేశాం
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
తదుపరి విచారణ నవంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను శాసించొద్దని, అలా అనుకోవడం ఎంత మాత్రం సరికాదని హితవు పలికింది. క్షేత్రస్థాయి కోర్టుల్లో ఏం జరుగుతున్నాయో తమకు తెలియదని, అందువల్ల నిర్దిష్టంగా ఇలాగే విచారణ జరపాలంటూ నియంత్రించజాలమని తేల్చి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో అన్ని విషయాలను సంబంధిత ట్రయల్ కోర్టే చూసుకుంటుందని తెలిపింది. రాజకీయ నేతల కేసుల్లో ఎలా వ్యవహరించాలో ఆదేశాల రూపంలో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులకు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పామని గుర్తు చేసింది. సీబీఐకి కూడా చెప్పాల్సింది చెప్పామని పేర్కొంది.
మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. జగన్ బెయిలు రద్దు చేసి విచారణను వేగవంతం చేసేలా కింది కోర్టును ఆదేశించాలని కూడా రఘురామ కోరారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌ఖన్నా , జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.
విచారణ ముందుకు వెళ్లకుండా నిందితులు డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పదేళ్లుగా డిశ్చార్జి పిటిషన్ల వల్ల సమయం వృథా అవుతోందని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సీఐబీ తరఫు న్యాయవాది ఎస్‌వీ రాజు ఎక్కడ ఉన్నారని ఆరా తీసింది. ఆయన మరో కోర్టులో ఉండటంతో విచారణను మధ్యాహా్ననికి వాయిదా వేసింది.
రఘురామపై కూడా సీబీఐ కేసులున్నాయి..
మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభం కాగానే రఘురామ తరపు న్యాయవాది మరోసారి డిశ్చార్జి పిటిషన్ల గురించి ప్రస్తావించడంతో ‘‘డోన్ట్ డిక్టేట్ అజ్’’ అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో ట్రయల్ కోర్టులో ఏం జరుగుతుందో తమకు తెలియదని, అన్ని విషయాలను ఆ కోర్టే తేలుస్తుందని తేల్చి చెప్పింది. 100 నుంచి 200 వరకూ రాజకీయ నేతలపై కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ తాము నియంత్రించగలమా? అని ప్రశి్నంచింది.
ఈ సమయంలో వైఎస్ జగన్ తరఫు సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్ రఘురామకృష్ణరాజుపై కూడా సీబీఐ కేసులు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయనపై రూ.800 కోట్ల వరకూ బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ తరఫు న్యాయవాది రాజు అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వారంలో చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment