మంగళవారం ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయ భవనాన్ని పరిశీలించి వస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీని ప్రకటించిన అనంతరం తొలిసారి సీఎం కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం తాత్కాలికంగా సర్దార్ పటేల్ మార్గ్‌లో తీసుకున్న అద్దె భవనాన్ని పరిశీలించారు. అన్ని గదులను కలియతిరిగిన కేసీఆర్.. తన ఛాంబర్, మీడియా హాల్, ముఖ్యనేతల కార్యాలయాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎంపీలు సహా ఇతర నేతలకు పలు సూచనలు చేశారు. వాస్తు, పార్కింగ్‌కు సంబంధించి మార్పులు, చేర్పులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం పనులను సైతం ఆయన పరిశీలించే అవకాశం ఉంది. కేసీఆర్ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని, పలువురు జాతీయ రాజకీయ పార్టీల పెద్దలను కేసీఆర్ కలుస్తారని తెలుస్తోంది. అదే సమయంలో మీడియాలోని కీలక వ్యక్తులు, మేధావులు, రిటైర్డ్ కేంద్ర ఉద్యోగులు, రైతు సంఘాల నేతలతోనూ ఆయన భేటీలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. రైతులు, విద్యుత్, బియ్యం సేకరణ, నదుల అనుసంధానం వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టే వ్యూహాలపై ఆయన నేతలతో చర్చించే అవకాశాలున్నాయి.
ములాయంకు నివాళి
తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ వెళ్లిన సీఎం కేసీఆర్.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ స్వగ్రామం అయిన సైఫయి చేరుకొని ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ కూడా దివంగత నేతకు నివాళులర్పించారు. అంత్యక్రియల అనంతరం సీఎం నేరుగా ఢిల్లీకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment