హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్‌తో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేసింది. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై, హర్యానా గవర్నర్‌ను కలిశారని సమాచారం.
హర్యానాలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) విబేధాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది.
ఈ నేపధ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు.. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ స్వతంత్ర ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫార్ములాపై బీజేపీ కసరత్తు చేసింది.
మరోవైపు.. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వీళ్ల భేటీలో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది.
అయితే.. హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment