టాయిలెట్లో నేలపై ఉంచిన పూరీలు, అన్నం. అందులోంచే వడ్డించుకుని తింటున్న ప్లేయర్లు
సహరన్‌పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్‌లో భోజనాలు వడ్డించారు! సహరన్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది.
అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్‌లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్‌గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్‌పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది.
మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్‌లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్‌లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు.
300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment