
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై రైతులు సాగిస్తున్న పోరాటం ప్రభావం చాలా అంశాలపై పడుతోంది. వారి నిరసనల నేపథ్యంలోనే తాజాగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 అకౌంట్లను సోమవారం ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేసింది. అకౌంట్లు బ్లాక్ అయిన వారు ఎవరో కాదంట.. తప్పుడు సమాచారం పోస్ట్ చేయడంతోపాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ట్విట్టర్ చర్యలు చేపట్టింది. అతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ట్విట్టర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పలువురి ట్విట్టర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలంటూ వారం కిందట ట్విట్టర్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందులో భాగంగానే ట్విట్టర్ తాజా నిర్ణయం.
ప్రసారభారతి సీఈఓతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తులకు చెందిన ట్విట్టర్ ఖాతాలను మూసివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది. "భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి పారదర్శకత చాలా ముఖ్యమైనది.నిలిపివేయబడిన కంటెంట్ కోసం మాకు నోటీసు విధానం ఉన్నది. కంటెంట్‌ను నిలిపివేయమని అభ్యర్థనలు అందిన అనంతరం ప్రభావిత ఖాతాదారులకు సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాం" అని ట్విటర్ ఆ ప్రకటనలో తెలిపింది.
'#ModiPlanningFarmerGenocide' హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్న, జనవరి 30వ తేదీన నకిలీ, బెదిరింపు, రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్న దాదాపు 250 ట్వీట్లు / ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజలను రెచ్చగొడుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 69 ఏ కింద ఆయా ట్విట్టర్ ఖాతాలను, ట్వీట్లను బ్లాక్ చేయమని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని దేశంలో శాంతిభద్రతల సమస్యలు పెరగకుండా నిరోధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు వివిధ చట్ట అమలు సంస్థల అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ సంస్థ ఈ ఖాతాలను బ్లాక్ చేసింది.