Video: MP CM Shivraj Singh Chouhan Washes Tribal Man Feet, After Man Urinated On Him - Sakshi
Sakshi News home page

MP Urination Row: మూత్ర విసర్జన ఘటన గిరిజన యువకుని కాళ్లు కడిగిన సీఎం శివరాజ్‌ సింగ్‌

Published Thu, Jul 6 2023 11:43 AM | Last Updated on Thu, Jul 6 2023 1:29 PM

Video: MP CM Shivraj Singh Chouhan Washes tribal Man Feet Urinated - Sakshi

మధ్యప్రదేశ్‌లోని సిధి  గిరిజన యువకునిపై  ఓ వ్యక్తి  మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడు ప్రవేశ్‌ శుక్లాగా గుర్తించిన  పోలీసులు..  బుధవారం అతన్ని అరెస్టు చేశారు.

తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడుడైన గిరిజన యువకుడి పాదాలను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  కడిగారు. దశమత్ రావత్‌ను సీఎం గురువారం భోపాల్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. అతన్ని ఓ కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. దళితుడి రెండు కాళ్లను ప్లేట్‌లో ఉంచి అతని పాదాలను నీళ్లతో కడిగారు శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌. అనంతరం అతనికి బొట్టు పెట్టి పూలమాల వేసి శాలువతో సన్మానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు తినిపించి కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
చదవండి: యువకునిపై మూత్ర విసర్జన.. నిందితుని ఇల్లు కూల్చివేత..

ఈ సందర్భంగా సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. మూత్ర విసర్జన వీడియో చూసి తన మనసుకు బాధనిపించిందన్నారు.ఇందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనలో నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని సీఎం వెల్లడించారు. 

మరోవైపు నిందితుడు ప్రవేశ్‌ శుక్లా బీజేపీకి చెందినవాడని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బీజేపీ దళిత, గిరిజన ద్వేషానికి ఈ ఉదంతం అద్దం పడుతోందని కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా దుయ్యబట్టారు. బీజేపీ హయాంలో వారిపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయని రాహుల్‌ ఆరోపించారు. అయితే ఆ వ్యక్తితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. దీనిపై విచారణకు నలుగురు వ్యక్తుల కమిటీ వేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించడం విశేషం. ఈ చర్య హీనమైనదని హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement