ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: దేశంలో కుల, మత, వర్గ వైషమ్యాలకు.. రాజకీయాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఫలితం.. విద్వేషాన్ని ఎక్కించుకుని మూర్ఖంగా వ్యవహరించే స్థితికి ప్రజలు చేరుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఓ దళిత మహిళ నీరు తాగిందనే కోపంతో.. నీటి ట్యాంకర్‌ను శుభ్రం చేశారు గ్రామస్తులు. అదీ గోమూత్రంతో కావడం గమనార్హం. ఛామరాజనగర్ జిల్లా హోగ్గోటరా గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నవంబర్ 18వ తేదీన గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అయితే.. ఆ వేడుకకు హాజరైన ఓ మహిళ.. తిన్న తర్వాత దాహం తీర్చుకునేందుకు అక్కడే ఉన్న ఓ ట్యాంకర్ నల్లా ద్వారా నీరు తాగింది. ఇది గమనించిన కొందరు పెద్దలు.. సదరు మహిళ ఎస్సీకి చెందింది కావడంతో రచ్చ చేశారు. వేడుకలో తాగేందుకు ఎవరూ అంగీకరించలేదని.. అందుకే దాహం తీర్చుకునేందుకు ట్యాంక్ నీళ్లు తాగానని ఆమె చెప్పింది. అయితే ఆ పెద్దలు ఆమెను మందలించి.. ట్యాంకర్ నుంచి నీటిని ఖాళీ చేయించారు. ఆపై కొందరి సలహాతో ‘పవిత్ర’మైన గోమూత్రంతో ట్యాంకర్‌ను శుభ్రం చేయించారట.
ఈ ఘటన స్థానిక తహసీల్దార్ దృష్టికి వెళ్లగా.. ట్యాంకర్ శుభ్రం చేసిన మాట వాస్తవమేనని, అయితే అది గోమూత్రంతో అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదని మీడియాకు తెలిపారు. ఇక బాధితురాలి గురించి తమ దగ్గర సమాచారం లేదన్న ఆయన.. ఆమె గురించి తెలిస్తే విచారించి, కేసు నమోదు చేస్తామని అన్నారు. అంతేకాదు గ్రామంలో చాలా వాటర్ ట్యాంకర్లు ఉన్నాయని, అందులో నీరు ఎవరైనా తాగొచ్చని ఆయన చెప్తున్నారు. ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ నివేదిక కోరడంతో.. పూర్తి స్థాయి నివేదికకు సిద్ధమైనట్లు సదరు తహసీల్దార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment