'థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం' | We Are Preparing For Third Covid Wave: Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

'థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం'

Published Thu, May 6 2021 2:34 AM | Last Updated on Thu, May 6 2021 5:06 AM

We Are Preparing For Third Covid Wave: Uddhav Thackeray - Sakshi

సాక్షి ముంబై: మహారాష్ట్రలో థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. మహారాష్ట ప్రభుత్వం, ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లతోపాటు ప్రజల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ముఖ్యంగా ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కరోనాను అడ్డుకునేందుకు అవలంభించిన తీరును బుధవారం సుప్రీంకోర్టు కూడా మెచ్చుకోవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ముంబై విధానాన్ని పాటించాలని సుప్రీంకోర్టు సూచించిందని వెల్లడించారు. ఇదంతా టీమ్‌ వర్క్‌తోనే సాధ్యమైందంటూ ఉద్దవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనాతోపాటు మరాఠా రిజర్వేషన్‌కు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా అందరి కృషితో ముంబైలో కరోనా కేసులు కొంత తగ్గాయని మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్యను స్థిరంగా ఉంచగలిగినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా పెరుగుదల కనిపిస్తోందని, కరోనాపై పోరాటం కొనసాగుతోందని చెప్పారు. అదేవిధంగా ఇంకా కేసుల సంఖ్యను తగ్గించేందుకు అందరి సహకారం అవసరమన్నారు.  

థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. 
నిపుణుల అంచనాల మేరకు దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా రానుందని చెబుతున్నారని వెల్లడించారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా అవసరమైన ప్రాంతాల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఐసోలేషన్‌ బెడ్లు పెంచుతున్నామన్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని ఫ్యామిలీ డాక్టర్లందరికీ మార్గదర్శనం చేసి వారి ద్వారా అవసరమైన వారే ఆస్పత్రిలో చేరేలా చూస్తున్నామన్నారు. మరోవైపు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరంలేని వారిని  ఇంటిలోనే మందులు వాడి చికిత్స పొందేందుకు ఫ్యామిలీ డాక్టర్ల సహకారం తీసుకోనున్నట్టు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 1700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉండగా రాష్ట్రంలో కేవలం 1250 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విన్నతి మేరకు 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. అయితే రాబోయే రోజుల్లో అవసరమైన ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి మూడు వేల మెట్రిక్‌ టన్నులకు పెరగనుందని తెలిపారు.  

సుప్రీం కోర్టు తీర్పుపై నిరాశ
మరాఠా రిజర్వేషన్‌ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని సీఎం ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఒక మార్గాన్ని కూడా చూపించిందన్నారు. ఎవరూ నిరాశపడాల్సిన అవసరంలేదని తెలిపారు. ఇందుకు అన్ని పార్టీలు కూడా కట్టుబడి ఉన్నాయన్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు మరాఠా రిజర్వేషన్‌ను రద్దు చేయడంతోపాటు ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొందని చెప్పారు. దీంతో ఈ విషయంపై ప్రధాన మంత్రి, రాష్ట్రపతి చొరవ తీసుకుని మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఉద్దవ్‌ ఠాక్రే కోరారు. గతంలో 370 చట్టంతోపాటు కొన్ని ధైర్యమైన నిర్ణయాల కోసం తమ అధికారాన్ని ఉపయోగించిన కేంద్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్‌పై కూడా తమ అధికారాన్ని వినియోగించి మరాఠా సమాజానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా కూడా తాను ప్రధానమంత్రి, రాష్ట్రపతికి వినతి పత్రాన్ని పంపనున్నట్టు, అవసరమైతే వారితో భేటీ అవుతానని చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మరాఠా సమాజం శాంతియుతంగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మరాఠా రిజర్వేషన్‌ అందరికీ అందేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement