న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్‌జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యోదంతంపై వైద్యులు, విద్యార్ధులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా పలు వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియా ఆదివారం ప్రకటించింది. దీంతో సోమవారం దేశంలో పలు రకాలైన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశాడనే ఆరోపణపై అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చిన అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు తన దుస్తుల్ని ఉతికి పడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి షూపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
పారదర్శకంగా దర్యాప్తు
జూనియర్ డాక్టర్ హత్య కేసులో నేరానికి కారకులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగతున్నాయి. ఈ తరుణంలో నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో భేటీ అయ్యారు. భేటీలో ఆయన మాట్లాడుతూ.. దర్యాప్తు పారదర్శకంగా ఉందని, పుకార్లను నమ్మొద్దని కోరారు.
సాక్ష్యాలను నాశనం చేసేందుకు..
‘నేరం చేసిన తర్వాత, నిందితుడు తిరిగి తన ఇంటికి వెళ్లి శుక్రవారం తెల్లవారుజాము వరకు నిద్రపోయాడు. నిద్రలేచిన తరువాత, సాక్ష్యాలను నాశనం చేసేందుకు అతను ధరించిన బట్టలు ఉతికాడు. అతడి షూపై రక్తపు మరకల్ని గుర్తించాము’ అని చెప్పారు. వైద్యురాలు హత్యకేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా..ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు.
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
గురువారం రాత్రి విధుల్లో ఉన్న వ్యక్తులతో మరుసటి రోజు ఉదయం వరకు మాట్లాడుతున్నామని, సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఆదివారం నాడు ఫోరెన్సిక్ యూనిట్‌తో పాటు సిట్‌లోని పోలీసు అధికారుల బృందం ఆసుపత్రిలోని సెమినార్ హాల్ నుండి నమూనాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
డిమాండ్స్ నెరవేర్చే వరకు ఆందోళన తప్పదు
అయితే ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు, తాము పూర్తిగా సంతృప్తి అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని, భద్రతకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment