న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో గురువారం హత్యాయత్నం జరగడంతో ఆయనకు సీఆర్‌ఫీఎఫ్‌తో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని అసదుద్దీన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రతపై చర్చ జరుగుతోంది.
ఎవరెవరికి రక్షణ కల్పిస్తారు?
దేశంలో అత్యంత ముప్పు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సమాచారం ఆధారంగా ఎవరెవరికీ ఏ స్థాయి భద్రత కల్పించాలనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
ప్రధానమంత్రి, హోం మంత్రితో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వీరితో పాటు ముప్పు పొంచి ఉందని భావించే వారు కూడా ప్రభుత్వ భద్రతను పొందుతారు.
వారికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత!
మన దేశంలో ఎక్స్, వై, వై-ప్లస్, జెడ్, జెడ్-ప్లస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ) కింద భద్రతా విభాగాలను వర్గీకరించారు. ఎస్‌పీజీ అనేది ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించబడింది. (చదవండి: చావుకు భయపడే వ్యక్తిని కాదు.. జెడ్ కేటగిరి భద్రత వద్దు)
ఏయే కేటగిరికి ఎంత?
► ఎక్స్ కేటగిరి రక్షణ ఉన్నవారికి ఒక గన్‌మ్యాన్‌ని మాత్రమే కేటాయిస్తారు.
► వై కేటగిరి కింద ఒక గన్‌మ్యాన్, స్టాటిక్ సెక్యూరిటీ కోసం ఒకరు (ప్లస్ ఫోర్ రొటేషన్‌లో) ఉంటారు.
► వై-ప్లస్ సెక్యురిటీ కలిగిన వారికి ఇద్దరు గన్‌మెన్‌లు (ప్లస్ నలుగురు రొటేషన్‌లో), నివాస భద్రత కోసం ఒకరు (ప్లస్ నలుగురు రొటేషన్) ఉంటారు.
► జెడ్ కేటగిరిలో ఆరుగురు గన్‌మెన్‌లు, ఇంటి వద్ద కాపలాలకు మరో ఇద్దరిని ( ప్లస్ 8) పెడతారు.
‘జెడ్- ప్లస్’ను వారే చూసుకుంటారు
జెడ్- ప్లస్ రక్షణ ఉన్న వారికి 10 మంది సాయుధ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. నివాస భద్రత కోసం మరో ఇద్దరిని (ప్లస్ 8) నియమిస్తారు. జెడ్- ప్లస్ భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు చూసుకుంటారు. ఇతర కేటగిరీ భద్రత కోసం ఢిల్లీ పోలీసులు లేదా ఐటీబీపీ, సీఆర్‌ఫీఎఫ్ సిబ్బందిని వినియోగిస్తారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment