సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం భారత్ బయోటెక్ కంపెనీ కనుగొన్న ‘కోవాక్సిన్’, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కనుగొన్న ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్లకు ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)’ ఆదివారం అత్యవసర వినియోగార్థం అనుమతి ఇవ్వడం పట్ల వివాదం చెలరేగుతోంది. మూడు దశల ట్రయల్స్‌కు సంబంధించి ఎలాంటి డేటాను సమర్పించకుండానే భారత్ బయోటెక్ కనుగొన్న కోవాక్సిన్‌కు ఎలా అనుమతి మంజూరు చేస్తారని, ఇది ప్రజల ఆరోగ్యంతోని ఆడుకోవడమేనని కొంత మంది శాస్త్ర వేత్తలతోపాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుండగా, ‘ఆత్మనిర్భరత వ్యాక్సిన్లు’ దేశానికి గర్వకారణమని, అనవసరంగా వాటిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రులు ఎదురు దాడికి దిగారు. సీరం ఇనిస్టిట్యూట్ కనుగొన్న ‘కొవీషీల్డ్’ వ్యాక్సిన్‌కు అనుమతివ్వడాన్ని సీనియర్ రాజకీయ నాయకుడు సుబ్రమణియన్ కూడా విమర్శించిన విషయం తెలిసిందే.
ఈ రెండు వ్యాక్సిన్లకు అనుమతివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన పరిశోధకుల్లో తుఫ్ట్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అరుణ్ మోహన్ సుకుమార్ కూడా ఉన్నారు. అత్యవసర వినియోగార్థమే అయినప్పటికీ క్లినికల్ ట్రయల్స్ డేటా లేకుండానే కోవాక్సిన్‌కు అనుమతివ్వడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనికా కంపెనీ కొలాబరేషన్‌తో కనిపెట్టిన కొవీషీల్డ్ ఎలా ఆత్మనిర్భర వ్యాక్సిన్ అవుతుందన్నది కూడా ఆయన ప్రశ్న. పైగా అది బ్రిటన్‌లో, బ్రెజిల్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
రోటావ్యాక్ ఆత్మనిర్భర వ్యాక్సిన్...!
ఇంతకుముందు భారత్ బయోటెక్ రోటా వైరస్ నిర్మూలన కోసం 2013లో ‘రోటావ్యాక్’ వ్యాక్సిన్‌ను గనుగొంది. ఆ వ్యాక్సిన్ ప్రయోగాల్లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు పాల్గొనగా, ‘బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్’ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసింది. రొటావ్యాక్ వ్యాక్సిన్‌ను 2015లో భారత్ బయోటెక్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే ‘ఫస్ట్ మేడిన్ ఇండియా’ వ్యాక్సిన్ అంటూ భారత్ బయోటెక్ కంపెనీతోపాటు ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారని, విదేశీ పరిశోధకులు, విదేశీ సంస్థల కొలాబరేషన్ ఉన్నప్పుడు ‘మేడిన్ ఇండియా’ ఎలా అవుతుందని మోహన్ సుకుమార్ మీడియా ముఖంగా ప్రశ్నించారు.
అసలు భారత్‌లో వ్యాక్సిన్ల తయారీకి అవకాశం ఏర్పడిందే 1987లో అమెరికాతో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ చేసుకున్న ‘వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్’ ఒప్పందం వల్ల. అయితే నాటి ఒప్పందాన్ని రాజీవ్ పార్టీ వారే ఎక్కువగా విమర్శించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలు పెట్టిన ‘స్వయం సమద్ధి’ విధానాన్ని రాజీవ్ మంట గలపారంటూ పాలకపక్ష సీనియర్ నేతలే విరుచుకు పడ్డారు. అప్పడు రాజీవ్ గాంధీ ఆగస్టు 17వ తేదీన భారత బయోటెక్నాలజీలో ఉన్నతాధికారి, తన సలహాదారుడైన ఎస్. రామచంద్రన్‌ను పిలిపించారు.
తమిళనాడుకు చెందిన రామచంద్రన్ బనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసి అమెరికాలోని ఇలినాయీ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. అది భారత్ నుంచి అమెరికాకు వలసలు పెరిగన సమయం. దేశం మీద భక్తితో రామచంద్రన్ అమెరికా అవకాశాలను వదులుకొని భారత్ వచ్చారు. భారత్‌లో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన్ని రాజీవ్ గాంధీ 1986లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ’ని ఏర్పాటు చేసి దానికి సెక్రటరీని చేశారు. రాజీవ్‌కు సంబంధిత విభాగంతో సలహాదారుగా ఉంటూ వచ్చారు. తనపై వస్తోన్న విమర్శల గురించి రాజీవ్ గాంధీ ఆయనతో చర్చించగా.......
స్వయం సమృద్ధి అంటే....
‘స్వయం సమృద్ధి అంటే మనకు అవసరమైన ప్రతిదాన్ని మనమే సమకూర్చుకోవడం లేదా తయారు చేసుకోవడం కాదు. ఇక్కడ ప్రజల ఆరోగ్యం ముఖ్యం. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించడం ముఖ్యం’ అని రామచంద్రన్ ఇచ్చిన సలహాతో రాజకీయాలను పట్టించుకోకుండా ముందుకే వెళ్లారు. ఆత్మనిర్భరత రాజకీయాలకు పనికి రావచ్చుగానీ, ప్రజల ఆరోగ్యానికి, మేథస్సుకు పనికి రాదని ప్రముఖ పరిశోధకులు మోహన్ సుకుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment