చల్లగా ఉండే శీతాకాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకుని మరింతసేపు పడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. అటువంటప్పుడు బద్ధకం ఎక్కువై ఉదయాన్నే నిద్ర లేవడం కష్టమవుతుంది. ఇది దినచర్యను ప్రభావితం చేస్తుంది. అయితే చలికాలంలో మనం ఎందుకు ఎక్కువసేపు నిద్రపోతామో మీకు తెలుసా? ఎందుకు ఇలా బద్ధకం ముంచుకొస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి కారణం చల్లని వాతావరణమే కారణం అనుకుంటే.. అదొక్కటే సరైన కారణం కాదు.
డి విటమిన్ లోపం
శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. పగటి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా బద్ధకంతో పాటు అధిక నిద్ర మొదలవుతుంది. ఇవేకాకుండా శీతాకాలంలో అధిక నిద్రకు అనేక కారణాలున్నాయి.
మెలటోనిన్ హార్మోన్ పెరుగుదల
శీతాకాలపు రాత్రులలో తగినంతగా నిద్ర పోయిన తరువాత కూడా బద్ధకం ఆవరిస్తుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలో శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ మెలటోనిన్ అధిక సమయం నిద్రకు కారణంగా నిలుస్తుంది. మెలటోనిన్ హార్మోన్ అధికంగా పెరగడం వల్ల మన నిద్రలో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ కారణంగా కొంతమందికి రోజంతా బద్ధకంగా అనిపిస్తుంది.
మెలటోనిన్ హార్మోన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. దీనివలన నిద్ర వస్తుంది. బయటి కాంతి తగ్గినప్పుడు ఇది నిద్రపోయే సమయం అనే సంకేతాన్ని మెదడుకు అందిస్తుంది. శీతాకాలంలో తక్కువ కాంతి కారణంగా మెలటోనిన్ ప్రభావం చాలాసేపు కొనసాగుతుంది. అందుకే చలికాలంలో ఉదయంపూట అధిక సమయం నిద్రపోతుంటాం.
బాడీ టైమ్ టేబుల్ అస్తవ్యస్తం
మనిషికి నిద్ర అలవాటు సిర్కాడియన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సిర్కాడియన్ ప్రక్రియ అంటే మన శరీరానికి సంబంధించిన అంతర్గత సమయ పట్టిక. ప్రతి కణం నియమిత తీరులో దాని పనిని అది చేస్తుంటుంది. కొన్ని అంశాలు మన సిర్కాడియన్‌ను అంటే మన జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో పర్యావరణం, ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి మొదలైన అంశాలు ఉన్నాయి. మారుతున్న వాతావరణం కూడా సర్కాడియన్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మన జీవ గడియారంలో స్వల్ప మార్పులు ప్రారంభమవుతాయి. శీతాకాలంలో నిద్రపోయే సమయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనకు ఎక్కువసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.
శరీరానికి వెచ్చదనాన్ని అందించడం
చలి పెరిగినప్పుడు వెచ్చగా ఉండటానికి మనం ఉన్ని దుస్తులను ధరిస్తాం. చాలా చల్లని లేదా చాలా వేడి ఉష్ణోగ్రతలు శరీరంపు సహజ నిద్ర ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. వెచ్చదనాన్ని అందించే దుస్తులు నిద్ర ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా మరింతసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది.
అతిగా ఆహారం తీసుకోవడం
చలికాలంలో చాలామంది అతిగా ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణ వ్యవస్థ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా బద్దకంగా అనిపించి, మరింత సేపు నిద్రపోతుంటాం. శీతాకాలంలో వెచ్చదనం కోసం చాలామంది నాన్ వెజ్ తింటుంటారు. ఈ నాన్‌వెజ్‌ను జీర్ణం చేసుకునేందుకు జీర్ణవ్యవస్థ ఇబ్బంది పడుతుంది. చలికాలంలో అధికంగా తినడం పలు అనారోగ్యం సమస్యలకు దారితీస్తుంది.
అధిక నిద్రను ఎలా నివారించాలి?
చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, వేపుడు పదార్థాలు తినడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, బలహీనమైన రోగనిరోధక శక్తి, జలుబు, ఫ్లూ వంటివి కూడా అధిక నిద్రకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక నిద్రను నివారించడానికి పగటిపూట వీలైనంత ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉండే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట నిద్రపోకుండా ఉండటానికి నిత్యం బిజీగా ఉండేందుకు ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.
చలికాలంలో రాత్రి భోజనంలో అధికంగా తినడం మానుకోవాలని, ఆకు కూరలు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు నీరు తాగితే, ఉదయం నిద్ర లేవడం సులభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం- మేల్కొనడం వల్ల శరీర గడియారం క్రమపద్ధతికి అలవాటు పడుతుంది. నిద్రలేచిన వెంటనే స్నానం చేయండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిచడంతో పాటు చురుకుదనాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్
Comments
Please login to add a commentAdd a comment