ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన నేరారోపణలు రుజువుకావడంతో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్(56)కు జీవిత ఖైదు పడింది. అయితే.. యాసిన్‌కు మరణశిక్ష విధించాలన్న ఎన్‌ఐఏ (NIA) విజ్ఞప్తిని ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తానికి యాసిన్‌కు శిక్ష పడ్డప్పటికీ.. జాతి వ్యతిరేక శక్తికి దన్నుగా నిలవడంతో పాటు శాంతి భద్రతలను దెబ్బతీసిన ఖూనీకోరుకి ఇది తక్కువే శిక్ష అనే అభిప్రాయమూ ఎక్కువగా వ్యక్తం అవుతోంది.
‘‘నా భర్తను యాసిన్ మాలిక చంపి 32 ఏళ్లు అవుతోంది. ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతుండడం ఇన్నాళ్లూ నాకు భారంగా అనిపించేది. నా భర్తను చంపిన తర్వాత కూడా మాలిక్ బతికే ఉండడం నన్నెంతో బాధించింది. రక్తపాతానికి రక్తమే సమాధానం. అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది.. అని నిర్మల్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన రవి కుమార్ భార్యనే ఈ నిర్మల్ ఖన్నా. 1990లో యాసిన్ మాలిక్, రవి కుమార్‌ను చంపారనే ఆరోపణలు ఉన్నాయి.
1990లో జరిగిన పరిణామాలతో కలత చెందిన ఎందరో.. ఇవాళ్టి శిక్షతో సంతోషంగా ఉండొచ్చు. కానీ, జాతి వ్యతిరేక శక్తులకు.. వాళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లను కఠినంగా శిక్షించాలి. యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాల్సింది. ఎందుకు విధించడంలేదో అర్థం కావడం లేదు. చాలా అసంతృప్తిగా ఉంది అని వ్యాఖ్యానించారు ఆమె. ఈ విషయమై ప్రధాని మోదీని కలిసి న్యాయం కోరాతానని అంటున్నారు ఆమె.
It's justice for victims of terror attacks carried out by him (Yasin Malik). Some might be satiated but I am not satisfied as I want the death penalty for him in my case: Nirmal Khanna, wife of IAF officer Ravi Khanna, a victim of a terror attack carried out by Yasin Malik pic.twitter.com/sd7Sf9ziId
— ANI (@ANI) May 25, 2022
యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించగా, జమ్మూలోని టాడా (టెర్రరిస్ట్ అండ్ యాంటీ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్) కోర్టు 2020 మార్చిలో యాసిన్‌తో పాటు మరో ఆరుగురిపై నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)ని చంపినందుకు అభియోగాలు మోపింది. 1990లో రవి ఖన్నా సహా శ్రీనగర్‌లోని అధికారులు మృతి చెందారు. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది.
నేను గాంధేయవాదిని..!!?
కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ‘గాంధీ అహింస సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొనడాన్ని ఢిల్లీ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. లోయలో పెద్ద ఎత్తున హింస చెలరేగినప్పటికీ, అతను హింసను ఖండించలేదని, పైగా తన నిరసనలను ఉపసంహరించుకోలేదని వ్యాఖ్యానించింది. 1994లో తుపాకీని పక్కనపెట్టి.. గాంధేయవాదిగా మారానన్న వాదనను సైతం స్పెషల్ జడ్జి ప్రవీణ్ సింగ్ తోసిపుచ్చారు. ఈ దోషి విషయంలో.. పరివర్తనను అంగీకరించేదే లేదు అని జడ్జి అభిప్రాయపడ్డారు.
ఈ దోషి తాను 1994కి ముందు చేసిన పనులకు ఏనాడూ పశ్చాత్తపం వ్యక్తం చేసింది లేదు. హింసను ఖండించిందీ లేదు. ప్రభుత్వం మారేందుకు అతనికి ఒక అవకాశం ఇచ్చింది. హింసను ఖండించేందుకు వేదికలపై ప్రసంగించే అవకాశం ఇచ్చింది. కానీ, ఏనాడూ తన చిత్తశుద్ధిని చూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఒక్కపక్క అతనేమో గాంధేయవాదిని అంటున్నాడు.. కానీ, ఆధారాలు మాత్రం మరోలా ఉన్నాయి అని జడ్జి వ్యాఖ్యానించారు. అంతా అతని(మాలిక్) గీసిన ప్లాన్ ప్రకారమే నడిచింది.. హింస చెలరేగింది అని న్యాయమూర్తి తెలిపారు.
మహాత్మా గాంధీ యొక్క సూత్రాలలో, లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా.. అందులో హింసకు ఏమాత్రం తావు లేదు. కాబట్టి, ఈ దోషి(యాసిన్ మాలిక్) మహాత్ముడి ప్రస్తావన చెప్పి.. గాంధేయవాదినని చెప్పుకునే అర్హత లేదని అనుకుంటున్నా. మొత్తం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడానికి మహాత్ముడికి చౌరీ చౌరా వద్ద ఒక చిన్న హింసాత్మక సంఘటన మాత్రమే పట్టింది. కానీ, కశ్మీరీ లోయలో పెద్ద ఎత్తున హింస చెలరేగినప్పటికీ మాలిక్ హింసను ఖండించలేదు సరికదా.. తన నిరసనలను ఉపసంహరించుకోలేదు అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చే ముందు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) (నిషేధిత సంస్థ) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ .. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ ఎన్‌ఐఏ తొలి కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment