UP Woman Bets Self In Game Of Ludo Loses To Landlord - Sakshi
Sakshi News home page

Ludo Game: పందెంలో ఓటమి.. యజమానికి తనను తాను కుదువ పెట్టుకున్న మహిళ.. భర్త ఎంట్రీ ఇవ్వడంతో!

Published Mon, Dec 5 2022 4:10 PM | Last Updated on Mon, Dec 5 2022 5:13 PM

UP Woman Bets Self In Game of Ludo Loses To landlord - Sakshi

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్లలో మునిగిపోతున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయేంతలా అందులో లీనమైపోతున్నారు. సమయం సందర్భం లేకుండా సోషల్‌ మీడియాను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ అతనికి సొంతం అయిపోయింది.

ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌గఢ్‌లోని కొత్వాలి నగర్‌ దేవ్‌ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్‌లైన్‌ గేమ్‌ లూడోకు ఆడేది. మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది.

అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది. తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య నిత్యం జూదం, ఆన్​లైన్ గేమ్స్​ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement