
ఎప్పుడూ వెన్నంటి ఉండనవసరం లేదు. అయినా, అండగా ఓ అన్నో, తమ్ముడో ఉన్నాడన్న ధీమా మామూలుగా ఉండదు. కానీ, ఆ చెల్లి భరోసాను యుద్ధం తీసుకెళ్లింది. దేశంకోసం అమరుడైన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి అందరినీ కంట నీరు పెట్టించింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా ఖుడియాలకు చెందిన గణ్‌పత్ రామ్ ఆర్మీలో పనిచేసేవాడు. 2017లో సెప్టెంబర్ 24న జమ్మూకశ్మీర్‌లో జరిగిన శత్రువుల దాడిలో గణ్‌పత్ ప్రాణాలు కోల్పోయాడు.
అతని సోదరి అన్న విగ్రహానికి రాఖీ కడుతున్న ఫొటోను వేదాంత్ బిర్లా లింక్‌డ్ ఇన్‌లో షేర్ చేశారు. ‘‘ఇదే భారత దేశ గొప్పదనం. బాధ, గర్వం కలగలిసిన ఓ క్షణం ఇది. అన్నను కోల్పోవడం బాధ, అతను దేశంకోసం ప్రాణ త్యాగం చేసినవాడు కావడం గర్వం. ఈ రాఖీ పర్వదినాన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టలేకపోయినందుకు ఆ సోదరి ఎంత మానసిక బాధ అనుభవించి ఉంటుంది. అందుకే అతని విగ్రహానికి కట్టింది’’ అంటూ కామెంట్ చేశారు. ఆ ఫొటో చూసిన నెటిజన్స్ ఆ అన్నాచెల్లెళ్లకు నీరాజనాలు పలుకుతున్నారు.