‘యాప్‌’సోపాలు.. యువతకు తిప్పలు | Youth Facing Problems Due to Money Lending Apps | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ బెట్టింగ్‌ల కోసం యువత అప్పులు

Published Wed, Nov 4 2020 11:04 AM | Last Updated on Wed, Nov 4 2020 12:53 PM

Youth Facing Problems Due to Money Lending Apps - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఫ్రెండ్‌ రాజేందర్‌కు యాక్సిడెంటైంది. అర్జంటుగా డబ్బులు పంపండి’ అంటూ సందేశాలు రావడంతో అవాక్కయిన మిత్రులు వెంటనే రాజేందర్‌కు ఫోన్‌ చేశారు. బాగానే ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు కానీ, ఆ మెసేజ్‌లు ఎవరు పంపారో మొదట అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేందర్‌ ఓ యాప్‌ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని తేలింది. 

‘మీ కొడుకు తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఏదుంటే అది ఎత్తుకు పోతాం..’ అంటూ ఫోన్‌లో వచ్చిన బెదిరింపుతో ఓ తండ్రి హతాశుడు అయ్యాడు. ఇంజనీరింగ్‌ చదివే తన కొడుకు రూ. లక్షలు అప్పు చేసిన ఫలితమని తెలిసి ఆయన తలపట్టుకున్నాడు. ఈ రెండు సందర్భాల్లోనూ కాల్‌ చేసింది కలెక్షన్‌ ఏజెంట్లు. వీరంతా వివిధ మనీలెండింగ్‌ యాప్స్‌ (అప్పులు ఇచ్చే యాప్స్‌) కోసం పని చేస్తుంటారు. ఏం చేసైనా ఇచ్చిన అప్పును వడ్డీతో సహా రాబట్టుకునేందుకు ఇటీవల హద్దుమీరుతున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్‌ కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేస్తూ, ఆ నంబర్లకు ఫోన్లుచేసి, తప్పుడు సందేశాలు పంపి సమాజంలో చులకన చేస్తున్నారు. వారిపై మానసిక ఒత్తిడి పెంచేందుకు దూకుడుగా వ్యవహరిస్తూ బ్లాక్‌మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఇలా అప్పిచ్చి.. అలా వేధిస్తూ..
మనీ లెండింగ్‌ యాప్స్‌కు మొబైల్‌ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇవి రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే క్రమంలో కంపెనీ షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్‌ నంబర్‌ అందించాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్‌ కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్‌ నంబర్లన్నీ యాప్‌ యాజమాన్యానికి యాక్సెస్‌ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్‌ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇబ్బందుల పాల్జేస్తున్నారు.

అప్పు మీద అప్పు.. పెరుగుతున్న ముప్పు
లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, సినిమా టాకీస్‌ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఇతర రంగాలకు చెందినవారు ఏడు నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తిరిగి తీర్చలేక, ఇంటి అవసరాల కోసమని మరోసారి అప్పులు చేసేందుకు అప్పుల యాప్‌లపై ఆధారపడుతున్నారు. చిన్నమొత్తంలో అప్పు చేసేవారికి ఫర్వాలేదు గానీ, భారీ మొత్తాల్లో అప్పుచేస్తే ఆ అప్పుల వసూళ్లకు కలెక్షన్‌ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు పెరిగారు. వీరు ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం కూడా భారీగా అప్పులు చేస్తున్నారు. ఇటీవల లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే తరహాలో అప్పుచేసి.. తీర్చే మార్గంలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం
అప్పు వసూలుకు వేధించడం, ఫోన్‌ కాంటాక్టులను యాక్సెస్‌చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకం. రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూలులోనూ కలెక్షన్‌ ఏజెంట్లు ఇష్టానుసారం వ్యవహరించడంపై బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. వాస్తవానికి కంపెనీ సహకారం లేకుండా.. కాంటాక్ట్స్‌ కలెక్షన్‌ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు అంటున్నారు.

బ్లాక్‌మెయిల్‌ చేస్తే సంప్రదించండి
అప్పు తీసుకున్న వారి కాంటాక్టులు యాక్సెస్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం చట్టవిరుద్ధం, నేరం. ఇలాంటి వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు. వెంటనే సైబర్‌ సెల్‌ను సంప్రదించాలి. బాధితులు విద్యార్థినులు, మహిళలైతే విమెన్‌ సేఫ్టీవింగ్‌ను ఆశ్రయించాలి.
– స్వాతి లక్రా, ఏడీజీ 

ఆ ఉచ్చులో పడనీయొద్దు
నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీ మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్, మనీలెండింగ్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి.
–డాక్టర్‌ శారద, ప్రొఫెసర్, ఓయూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement