విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Published Wed, Jan 29 2025 12:52 AM | Last Updated on Wed, Jan 29 2025 12:51 AM

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

● పదో తరగతి విద్యార్థుల ప్రేరణ, శిక్షణలో కలెక్టర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సూచించారు. పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ప్రేరణ, శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును అధికారులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నారు. పరీక్షలకు రానున్న రెండు నెలలు కీలకమని, సమయం వృథా చేయకుండా మీ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడాలన్నారు. ఇప్పటికే సిలబస్‌ పూర్తయినందున ప్రత్యేక తరగతులకు వందశాతం విద్యార్థులు హాజరు కావాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను సంబంధిత ఉపాధ్యాయులు నివృత్తి చేయాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలు ఎక్కువగా ప్రాక్టిస్‌ చేయాలని, వీలైనన్ని ఎక్కువ మోడల్‌ పరీక్షలు రాయాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అండగా ఉంటారన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో పి.రామారావు, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్‌, రాజేశ్వర్‌గౌడ్‌, వార్డెన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పునరావాస గ్రామాల్లో వసతులు కల్పించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో పునరావాసం కల్పించిన మైసంపేట్‌, రాంపూర్‌ గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పునరావాస గ్రామాల ప్రజలకు కల్పిస్తున్న వసతులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించిన సమాచారాన్ని శాఖల వారీగా సమీక్షించారు. పునరావాసం పొందిన ప్రజలకు కేటాయించిన వ్యవసాయ భూములను సాగుకు యోగ్యంగా మార్చాలన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలన్నారు. పంట భూములకు సంబంధించి రెవెన్యూ పట్టాల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, ఆర్డీవో రత్నకళ్యాణి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement