బట్టీల్లో కాలుతున్న చెట్లు
● జిల్లాలో జోరుగా కలప దందా ● ఇష్టారీతిన వృక్షాల నరికివేత ● ఇటుక బట్టీలు, ఇతర జిల్లాలకు తరలింపు
భైంసాటౌన్: భైంసా అటవీ రేంజ్ పరిధిలో కలప దందా జోరుగా సాగుతోంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతుల పేరిట నామమాత్ర అనుమతులతో ఇష్టారీతిన చెట్లు నరికి తరలిస్తున్నారు. ఒకటి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి పొంది, ప్రతీరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో నాన్‌టేక్ కలపను స్థానిక ఇటుక బట్టీలతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సామిల్లులకు కూడా తరలించుకుపోతున్నారు. ఫలితంగా రేంజ్ పరిధిలో ఇష్టారీతిన చెట్లు నరికివేస్తున్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది.
భైంసా కేంద్రంగా...
కొందరు నాన్‌టేక్ దందా నిర్వహకులు భైంసాతోపాటు నియోజకవర్గంలోని కుభీర్, తానూరు, ముధోల్ తదితర మండలాల్లోని గ్రామాల్లో చెట్లను నరికి ట్రాక్టర్లలో పట్టణ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలా తరలించిన కలపను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. కొన్నింటిని ఇటుక బట్టీలకు, సామిల్లులకు తరలిస్తునానరు. పెద్ద మొత్తంలో పోగు చేసిన కలపను ఇతర ప్రాంతాలకూ తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల వద్ద నామమాత్ర అనుమతులు తీసుకుంటూ, పెద్ద సంఖ్యలో చెట్లను నరికి తరలిస్తున్నారు. భైంసా–నిర్మల్, కుభీర్, భోకర్, బాసర మార్గాల్లో నిత్యం రాత్రివేళల్లో ట్రాక్టర్లలో జోరుగా నాన్‌టేక్ కలప తరలుతోంది. అధికారులు పట్టుకున్న సందర్భాల్లో ట్రాక్టర్ ఇంజిన్ చెడిపోయిందని, ట్రాలీ వేరేది అమర్చినట్లు చెబుతూ తప్పించుకుంటున్నారు. అటవీశాఖలోని కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతోనే అక్రమదందా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటున్నాం..
అనుమతి లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటాం. ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగించినట్లు దృష్టికి వస్తే జరిమానా విధిస్తున్నాం. నాన్‌టీక్, టీక్ అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. – వేణుగోపాల్, ఎఫ్‌ఆర్‌వో, భైంసా
ఇటుక బట్టీల్లో వినియోగం..
డివిజన్ పరిధిలోని పలు ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు దాడి చేసి కట్టెలు వినియోగిస్తున్న ఇటుక బట్టీల నిర్వహకులకు జరిమానా విధించారు. అయినా, మళ్లీ కొందరు యథేచ్ఛగా కట్టెలు వినియోగిస్తున్నారు. ఫలితంగా బట్టీల్లో నుంచి వచ్చే పొగతో రోడ్లపై వాహనదారులు, బట్టీల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బట్టీల్లో కాలుతున్న చెట్లు
Comments
Please login to add a commentAdd a comment