Police Arrested 9 Young Women Who Committed Theft in Sainagar Shirdi Train - Sakshi
Sakshi News home page

షిర్డీ రైలులో కలకలం.. చైన్‌ లాగి బ్యాగులతో పరుగు.. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో..

Published Thu, Jul 13 2023 6:02 AM | Last Updated on Thu, Jul 13 2023 2:28 PM

- - Sakshi

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్‌ షిర్డీ రైలులో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మంది యువతులను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. రైలు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరిన తర్వాత నవీపేట్‌ స్టేషన్‌ వద్ద క్రాసింగ్‌ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారాష్ట్రలోని బిడ్‌ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలులో ఎక్కారు.

యువతులు ఎస్‌1 నుంచి ఎస్‌10 బోగీలలో అటుఇటూ తిరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్‌ కనబడకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్రమత్తమైన ఆ కోచ్‌లోని మిగతా వారు తమ బ్యాగ్‌లను చెక్‌ చేసుకోగా మరో ఆరుగురికి చెందిన బ్యాగులు కూడా కనిపించలేదు. దీంతో బోగీలో కలకలం రేగింది. కొందరు ప్రయాణికులు బాసర వద్ద ట్రైన్‌ చైన్‌ లాగడంతో ఆగిపోయింది. ఈ క్రమంలో కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి, మొత్తం తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విచారిస్తున్న రైల్వే పోలీసులు
రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్‌తో పాటు ల్యాప్‌టాప్‌, కొంత నగ దు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్‌ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్‌, షేక్‌ నజీర్‌బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్‌ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌ల ను పోలీసులు రైల్వేపట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యా గులను యువతులు బాత్‌రూంలలో పె ట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకు న్న తొమ్మిది మందిని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. యువతులు నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్‌ వచ్చినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement