కమ్మర్‌పల్లిలో దొంగల బీభత్సం
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మినుముల గంగాధర్ సొంతింట్లో ఒక గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు. పక్క గది తాళం పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ. 5 లక్షల నగదుతోపాటు, 5 గ్రాముల బంగారం, 12 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటలకు ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ హార్న్ మోగడంతో గంగాధర్ నిద్రలేచి తలుపు తెరవబోగా, బయటి నుంచి గొళ్లెం పెట్టి ఉండడంతో తెరుచుకోలేదు. తెలిసిన వారికి ఫోన్ చేయడంతో వారు గంగాధర్ ఇంటికి చేరుకోగానే దొంగలు పరారయ్యారు. కాగా, ఎంఈవో ఆఫీస్ సమీపంలోని వాన్‌కార్ శ్రీనివాస్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ కొంతకాలంగా సొంతింట్లో కాకుండా సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం శ్రీనివాస్ భార్య సొంతింటికి వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడంతో దొంగతనం వెలుగు చూసింది. దుండగులు బీరువా తెరిచి అందులోని రూ. 20 వేల నగదు, 5 గ్రాముల బంగారం అపహరించుకుపోయారు. బాధితుల సమాచారం మేరకు ఎస్సై అనిల్‌రెడ్డి ఘటనా స్థలాలకు చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
కిష్టాపూర్‌లో..
బాన్సువాడ : బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నార్లపల్లి భూమయ్య ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పది రోజుల క్రితం భూమయ్య అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని నగదు, బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
రెండిళ్లలో చోరీ
రూ.5.20 లక్షల నగదు,
తులం బంగారం, వెండి అపహరణ
Comments
Please login to add a commentAdd a comment