అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో
- తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 )
- నల్లవారు 12 శాతం,
- మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు.
మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం
- క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో
- వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్‌ది.
- యూదులు 2 శాతం కాగా,
- ఇతర చిన్న మతాల వారు 3 శాతం
- లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం
అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు.
ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు.
కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు.
హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్‌లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్‌లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో.
ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం !
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment