శాక్రమెంటో: కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. పదే పదే కాలింగ్ బెల్ కొట్టి విసిగిస్తున్నారనే కోపంలో ముగ్గురు టీనేజర్లను కారుతో గుద్ది చంపేశాడు. అయితే మూడేళ్ల కిందటి నాటి ఈ కేసులో.. తాజాగా నిందితుడిని దోషిగా తేల్చింది కోర్టు.
కాలిఫోర్నియాలో అనురాగ్ చంద్ర.. భార్య, కూతురితో నివాసం ఉంటున్నాడు. అరోమాథెరపీలో, కొన్నిరకాల సెంట్లలో వాడే ఆయిల్ తయారు చేసే కంపెనీకి చంద్ర వైఎస్ ప్రెసిడెంట్ కూడా. 2020 జనవరి చివరి వారంలో ఓ సాయంత్రం.. ముగ్గురు టీనేజీ కుర్రాళ్లు అనురాగ్ ఇంటి కాలింగ్ బెల్‌ను పదే పదే కొట్టి ఆయన్ని విసిగించారు. డింగ్ డాంగ్ డిచ్(డోర్‌బెల్ డిచ్) పేరిట అక్కడ బాగా ప్రచారంలో ఉండే ప్రాంక్ గేమ్ ఆయన మీద ప్రయోగించాలని వాళ్లు భావించారు. ఆపై కుర్రాళ్లు పారిపోయే క్రమంలో అనురాగ్‌కు అసభ్య సంజ్ఞలు చేశారట. దీంతో అనురాగ్‌కు చిర్రెత్తుకొచ్చింది.
👉 అప్పటికే పీకల దాకా తాగి తూలిపోతున్న అనురాగ్.. కారు వేగంగా నడుపుతూ వాళ్లను వెంబడించాడు. అయితే కారు అతి వేగంగా వెళ్లి ఆ టీనేజర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ముందుకెళ్లి ఓ చెట్టును ఢీ కొట్టింది. టెమెస్కల్ వ్యాలీ దగ్గర జరిగిన ఈ కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. అనురాగ్ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో డింగ్‌డాంగ్ డిచ్ కేసుగా, డోర్‌బెల్ ప్రాంక్ కేసుగా ఇది పాపులర్ అయ్యింది.
👉 ఇక ఈ ఘటనలో.. చంద్ర చంపిన ముగ్గురూ 18 ఏళ్లలోపు వాళ్లు కావడం గమనార్హం. అయితే తాను కేవలం తన కోపాన్ని ప్రదర్శించే క్రమంలోనే వాళ్లను వెంబడించానే తప్పా.. చంపాలనే ఉద్దేశంతో కాదని చంద్ర చెబుతూ వచ్చాడు. అంతేకాదు ఘటనకు ముందు తాను 12 బీర్లు తాగననని, వచ్చినవాళ్లు తన భార్యాకూతురిని ఏమైనా చేస్తారేమోననే ఆవేశంలోనే అలా ప్రవర్తించానని వాంగ్మూలం ఇచ్చాడు.
👉 అయితే పోలీసులు మాత్రం చంద్ర కారును 64 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో.. 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కావాలనే ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడని కోర్టుకు నివేదించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ దాడిలో చంద్రను కఠినంగా శిక్షించాలని తెలిపారు. అన్ని వాదనలు విన్న కోర్టు.. చివరకు తాజాగా అనురాగ్ చంద్రను దోషిగా ఖరారు చేసింది. ఇక శిక్ష జులైలో ఖరారు కావాల్సి ఉంది. అయితే.. నేరం తీవ్రత దృష్ట్యా పెరోల్ దొరకకుండా ఆదేశిస్తూ.. అనురాగ్ చంద్రకు కోర్టు జీవిత ఖైదు విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చదవండి: అమ్మాయిలకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు! కట్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment