అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్‌ అర్థమవ్వాలంటే మాత్రం..! | The Greatest Stand Up Comics From The USA | Sakshi
Sakshi News home page

అమెరికన్లు మంచి హాస్యప్రియులు ! జోక్స్‌ అర్థమవ్వాలంటే మాత్రం..!

Published Sun, Mar 24 2024 12:21 PM | Last Updated on Sun, Mar 24 2024 12:30 PM

The Greatest Stand Up Comics From The USA - Sakshi

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి ఏ కన్నీళ్లెనకాల ఏముందో తెలుసునా! అంటాడు సినిమా కవి ఆచార్య ఆత్రేయ ( మూగ మనసులు ).  హాస్యం ప్రపంచ భాష, మనుషులందరికీ అర్థమయే భాష. అది అందరినీ కలపడంలో మేటి. స్నేహితులను పెంచుకోడానికి దానికదే సాటి. స్నేహితులు పెరగాలంటే హాస్య గుణం ఉండాలి మరి. ఆత్మీయులు కలుసుకున్నప్పుడే హాస్యం పండుతుంది. కానీ కొత్తగా కలుసుకున్న వారి మాటలు పొడిపొడిగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికల్లో హాస్యం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. మన కుటుంబ జీవితాల్లో బావ బావమరదులు, వదినా మరదళ్ళను హాస్యరస పోషకులు అనవచ్చు. అమెరికన్స్ మంచి హాస్యప్రియులు. అన్ని వయసులవారు జోక్స్ వేసుకొని హాయిగా నవ్వుకుంటారు.

మనసును తేలిక చేసుకుంటారు, ఆహ్లాదంతో ఆరోగ్యాన్నీ పొందుతారు. అమెరికన్ల హాస్యం స్త్రీపురుష సంబంధాలు, శృంగారం, వివాహం, విడాకులు, త్రాగుబోతుల చుట్టూ ఎక్కువగా తిరిగినట్లు అనిపిస్తుంది. వాళ్ల జోక్స్ అర్థంచేసుకోడానికి కాస్త బుర్రకు పని చెప్పాల్సిందే. నేను విన్న కొన్ని పాపులర్ జోక్స్ చూడండి. ప్రేమించు , యుద్ధం వద్దు. రెండూ కావాలనుకుంటే పెళ్ళి చేసుకో ! ఔను ప్రేమ గుడ్డిదే అది స్పర్శతో ముందుకు పోయేది కదా ! ప్రస్తుతం దీనస్థితిలోనున్న చాలామంది భర్తలు ఒకప్పుడు ఎంతో భాగ్యవంతులైన బ్రహ్మచారులు. స్త్రీలు మౌనంగా ఉండే భర్తలను ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలన్నీ భర్త వింటున్నాడని వారి నమ్మకం.

స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కలిగి ఉంటారు అదేమిటంటే ‘ స్త్రీ జాతిని నమ్మరాదు’ స్త్రీతో వాదించొద్దు ఆమె అలసిపోయినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ! ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది ఏం చేయమంటారని భార్య భర్తను అడిగిందట. అయన గారు ఇచ్చిన సలహా ‘ అలా షాపింగ్ కు వెళ్ళిరా! ’ అని. సందేహం లేదు వివాహం గొప్ప వ్యవస్థే అయినా వ్యవస్థతో కలిసి బతికేదెవరు ! వ్యభిచారమంటే ఏదో కాదు ప్రజాస్వామ్యాన్ని ప్రేమకు వర్తింపజేయడమే ! వివాహం ఎవరికైనా సంతోషకరమైందే, విడాకులు అంటే ఒక విపత్తు లాంటిదిగా భావించడం సహజమే. అయితే పాశ్చాత్యుల జీవితాల్లో ఇవి చాలా సామాన్య విషయాలుగా కనబడుతాయి. మీవాడు మావాడు కలిసి మనవాణ్ణి కొడుతున్నారు వెళ్లి ఆపండి ! అన్నదట ఒక భార్య భర్తతో . ఇద్దరు స్నేహితురాళ్లు మాట్లాడుకుంటుండగా అప్పుడే ఇంట్లోకి వచ్చిన భర్త ఏం చేస్తున్నావు ? అన్నాడట.

ఆమె వెంటనే తన స్నేహితురాలితో ‘ వెంగళప్పని చెప్పానుగా , ఈయనే మా ఆయన ‘ అందట. మద్యపానం అమెరికన్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అనవచ్చు. ఈ విషయంలో మన వాళ్ళు కూడా వారితో పోటీ పడుతున్నట్లే ఉంది అది వేరే విషయం. ఔను త్రాగుడు దుర్వ్యసనమే, దాన్ని మరిచిపోవడానికి మళ్ళీ తాగక తప్పడం లేదు అన్నాడట ఒక మహానుభావుడు. మితిమీరిన మద్యం అలవాటు తగ్గించుకోడానికి ఒక వ్యక్తి సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడట. అది బాగా పనిచేసింది. ప్రతి బుధవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య అతను త్రాగకుండా ఉండగలిగాడట. అమెరికాలో కావాలనుకుంటే ఏ విషయం మీదైనా పుస్తకాలు దొరుకుతాయి. 

కాకపోతే మనకు చదివే ఆసక్తి, ఓపిక ఉండాలి. త్రాగుడు, జూదంలో నిన్ను మించిన వాడు లేడు, నీ అనుభవాలతో ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడట. దానికి త్రాగుబోతు జవాబు ‘ రాయడమెందుకు, మార్కెట్లో ఒకటి కొనుక్కుంటే చాలదా ! ’ అని. అమెరికాలో అయిదు రోజుల పనిదినాలు అవడం వల్ల శని , ఆదివారాలు సెలవులే, శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి బయట పడే సమయం. కార్యాలయంలో బాస్ సరిగ్గా 4 గంటలకు సమావేశం పెట్టడం నచ్చక ఇదేమిటని అడిగారట అక్కడ పనిచేసే ఉద్యోగులు. దానికి బాస్ చెప్పిన సమాధానం ‘ వారంలో అదే చాల అనుకూలమైన సమయం ఎందుకంటారా , నేను ఏది చెబితే అది ఎదురు చెప్పకుండా వాదనలు చేయకుండా వింటారు కదా! ’
 వేముల ప్రభాకర్

(చదవండి: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement