సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా..
ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే
భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్‌ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి.
డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు
- అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు.
- అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు.
- నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment