గన్నవరం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వేరొకరితో చాటింగ్ చేస్తోందనే సంశయంతో ఆమైపె హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణాజిల్లా ముస్తాబాద శివారులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... బర్రె కిరణ్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అతను విజయవాడ మారుతీనగర్‌లోని ఓ ఇంట్లోని పెంట్ హౌస్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతను15 ఏళ్లుగా ఇంటి యజమానురాలితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఆమె అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తుండడం, తరుచూ ఫోన్లు మాట్లాడుతుండడం గమనించిన కిరణ్ ఆమైపె అనుమానం పెంచుకున్నాడు.
వేరే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు. దీనిలో భాగంగా బ్యాంక్‌లో పని ఉందంటూ ఆమెను నమ్మబలికి తన కారులో విజయవాడ నుంచి నున్న మీదుగా ముస్తాబాద శివారు ప్రాంతానికి తీసుకువచ్చాడు. అతని ప్లాన్‌లో భాగంగా మార్గం మధ్యలో పెట్రోల్ బంక్‌లో క్యాన్‌లో నాలుగు లీటర్ల పెట్రోల్ కూడా కొనుగోలు చేశాడు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటూ ఆమెతో కిరణ్ కారులోనే గొడవ పడ్డాడు.
ఆగ్రహానికి గురైన కిరణ్ తన వెంట తీసుకువచ్చిన కూరగాయలు కోసే చాకుతో ఆమె మెడపై పొడవబోయాడు. అప్రమత్తమైన ఆమె చేతిని అడ్డుకుని ఆతనితో పెనుగులాడింది. కారు దిగి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఎన్‌హెచ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్న టిప్పరు డ్రైవర్లు గమనించారు.
వెంటనే వచ్చిన వారు అతని నుంచి ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి పది నిమిషాల వ్యవధిలోని ఘటన స్థలానికి చేరుకుని కిరణ్‌ను అదుపులో తీసుకున్నారు. అప్పటికే మెడపై చాకు గాట్లతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.కనకారావు తెలిపారు. ఘటనపై ఎస్పీ పి. జాషువా సకాలంలో స్పందించి స్టేషన్ అధికారులను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment