శాస్త్రవేత్త రామకృష్ణ
పెనమలూరు: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సాంకేతిక ఆవిష్కరణలకు వేదిక అని, విద్యార్థులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వినియోగించి ఆవిష్కరణలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.రామకృష్ణ అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ యువత వారి నైపుణ్యాన్ని వ్యక్తిగత ఎదుగుదల కోసం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కొండపల్లి శివాజీబాబు మాట్లాడుతూ పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో నోడల్ కేంద్రంగా సాఫ్ట్వేర్ క్యాటగిరిలో 5 థీమ్స్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో 27 అగ్రశ్రేణి బృందాల నుంచి 162 మంది పాల్గొని తమ నైపుణ్యం ప్రదర్శిస్తారని అన్నారు. ప్రతి థీమ్‌లో గెలుపొందిన జట్టుకు రూ. లక్ష చొప్పున 5 జట్లకు రూ. 5 లక్షలు బహుమతి ఉంటుందని తెలిపారు. కాగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొని వారు తక్కువ ఖర్చుతో రూపొందించిన మోడల్స్ ప్రదర్శించారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, నోడల్ సెంటర్ అధికారి పి.సాయికిరణ్, టెక్నికల్ హెడ్ వెంగల జగదీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం: ఇంటి గోడలు తొలగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం భీమరాజుగుట్ట ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రోజువారీ కూలిపనులు చేసుకునే కె.అప్పయ్య (45) ఇంటిగోడలు తొలగిస్తున్నాడు. ఆ సమయంలో కరెంట్ షాక్‌కు గురైయ్యాడు. హుటాహుటిన విజయవాడ వైద్యశాలకు ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రాన మునిగారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment