దొడ్డదేవరపాడులో
నీటికి కటకట
గాంధీనగర్( విజయవాడ సెంట్రల్): భౌగోళికంగా ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణమ్మ, మరో వైపు కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవహిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎన్టీఆర్ జిల్లాలో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది చెంతనే ఉన్నా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో సగభాగానికి కూడా కృష్ణానది నీరు సరఫరా కావడం లేదు. జిల్లాలోకి ప్రవహించే ఉపనదులు వైరా, కట్టలేరు, మున్నేరులలో నీటి జాడ కనిపించడం లేదు. మున్నేరు పూర్తిగా ఎండిపోగా... కట్టలేరు, వైరా యేరుల్లో నీటి చారికలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపనదులపై నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు ఆశించిన స్థాయిలో రక్షిత నీరు అందించ లేకపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ప్రమాణాలు పాటించకపోయినప్పటికీ ప్రజలు వేరే గతి లేక ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేసి తాగవలసి వస్తోంది. మార్చి నెలలోనే నీటి కష్టాలు మొదలు కావడంతో ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చుక్క నీరు కానరాని కట్టలేరు
తిరువూరు నియోజకవర్గం నుంచే కట్టలేరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం కట్టలేరులో నీరు లేదు. కట్టలేరు ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. కానీ కట్టలేరులో నీరు లేకపోవడంతో మోటార్లు దెబ్బతింటున్నాయి. నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, కొణిజర్ల, పెనుగొలను గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా తాగేందుకు అనువుగా ఉండవు. ఇక్కడకు పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని అందిస్తున్నారు. వేసవి మరింత ముదిరే నాటికి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి ఎద్దడి లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో కట్టలేరు పక్కనే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి సరిపడా తాగునీరు సరఫరా జరగడం లేదు. వి.అన్నవరం వద్ద వైరా యేరులో మోటార్లు ఏర్పాటు చేసిన నీటిని అందిస్తున్నారు. అవి చాలకపోవడంతో స్థానికంగా ఏర్పాటు చేసిన మోటరు ద్వారా నీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. వీటిలో లవణ శాతం అధికంగా ఉండడం వాడకానికి కూడా వినియోగించే పరిస్థితి లేదు. కట్టలేరు ఒడ్డునే ఉన్న ఈ గ్రామానికి రాబోయే రెండు మూడు నెలలు నీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి వీరులపాడు నుంచి తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ జనాభా అవసరాలకు సరిపోవడం లేదు. కంచికచర్ల మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కృష్ణా నది ఒడ్డు వెంబడి నీరు లేకపోవడంతో మోటార్లు ఆడే పరిస్థితి లేదు. మున్నేరు వైరా ఏరు కలిసే చోట ఉన్న కీసర, పెండ్యాల గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎస్.అమరవరం, మోగులూరు గ్రామాల్లో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో కొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో నీరు లేకపోవడం, లీకేజీల కారణంగా సక్రమంగా సరఫరా జరగడం లేదు. విజయవాడ నగరంలో ఊర్మిళానగర్‌లో పాయకాపురం తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తోందని ప్రజలు చెబుతున్నారు. సరిగా శుద్ధి చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా సరైన ప్రమాణాలు పాటించని ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది.
వారానికో రోజు తాగునీరు
చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా మా గ్రామానికి వారానికి ఒక రోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. తాగునీటికి ఇబ్బందిగా ఉంది. మార్చిలోనే పరిస్థితి ఈ తీరుగా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. సరిపడా తాగునీటిని అందించాలి.
–జల్లి కార్ల్‌మార్క్స్, జుజ్జూరు
నాలుగైదు రోజులకోసారి మంచినీరు
మా ఊరు మున్నేరు ఒడ్డునే ఉంది. మున్నేరు ఎండిపోయింది. మాకు నాలుగైదు రోజులకోసారి మంచినీరు వస్తోంది. మేం కూలి పనులకు వెళ్లేవాళ్లం. మంచినీళ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు తాగునీటి ఇబ్బందులను తొలగించాలి.
–కోలగట్ల సత్యవతి, కీసర
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతిపంపులు ఉన్నాయి. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రయివేట్ ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి. ఇవే ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు. వేసవి ప్రారంభమై నెల రోజులు కావడంతో గ్రామాల గొంతెండుతోంది. నీటి ఎద్దడి ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా అరకొరగా వస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు దశాబ్దాల కిందట నిర్మించడం, అప్పట్లో వేసిన పైపులైన్లకు లీకులు ఏర్పడడంతో నీరు వృథా అవుతోంది. లీకేజీల కారణంగా రక్షిత మంచినీరు సరఫరా కావడం లేదు. దీనికి తోడు జనాభా పెరుగుదల, నీటి వాడకం పెరగడంతో పథకాలు తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయి.
గొంతెండుతున్న పల్లెలు ముంచుకొస్తున్న నీటి ఎద్దడి ఎండిపోయిన ఉప నదులు కృష్ణానది చెంతనే నీటి కష్టాలు
రెండు రోజులకోసారి తాగునీటి సరఫరా
దొడ్డదేవరపాడులో
దొడ్డదేవరపాడులో
దొడ్డదేవరపాడులో
Comments
Please login to add a commentAdd a comment