నైపుణ్యాల పెంపునకు క్రీడలు దోహదం
విజయవాడస్పోర్ట్స్: సంకల్పం, లక్ష్యాలను నిర్దేశించే నైపుణ్యాన్ని పెంచుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటక్చర్ ఇనిస్టిట్యూట్(ఎస్‌పీఏ) డైరెక్టర్ రమేష్ శ్రీకొండ అన్నారు. ఎస్‌పీఏ జాతీయ క్రీడా పోటీలు విజయవాడలోని ఎస్‌పీఏ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను రమేష్ శ్రీకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, స్నేహభావం ప్రాముఖ్యతను క్రీడలు తెలియజేస్తాయన్నారు. క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో క్రీడాకారులు ముందు వరసలో ఉంటారని తెలిపారు. చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ జాతీయ పోటీల్లో ఢిల్లీ, భోపాల్, విజయవాడ ఇనిస్టిట్యూట్‌ల విద్యార్థినీ విద్యార్థులు ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో తలపడతారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రోఫీలను రమేష్ శ్రీకొండ ఆవిష్కరించారు. ఇనిస్టిట్యూట్ రిజిస్ట్రార్ కె.ఉమామహేశ్వరరావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఎస్.వి.కృష్ణకుమార్, ఆర్కిటెక్చర్ హెచ్‌వోడీ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు డి.జగత్‌కుమారి, ప్లానింగ్ హెచ్‌వోడీ ప్రశాంత్‌వర్థన్ పాల్గొన్నారు.
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ ఎస్‌పీఏ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment