ఇచ్చింది గోరంత
నష్టం కొండంత...
జి.కొండూరు: గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ఈ వరదలతో ఇటు మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ రూరల్ మండలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వందలాది మూగజీవాలు, ప్రజలు ప్రాణాలు కోల్పోగా వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వరదలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలో బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఎడమవైపున కొండపల్లి శాంతినగర్‌కు సమీపంలో పడిన మూడు భారీ గండ్ల వలనే విజయవాడ పరిసర ప్రాంతాలు రోజుల తరబడి వరద ముంపులోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించి బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ మీడియా ముందు ఊదరగొట్టారు. ఆ తర్వాత బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో మొదటి దశ ప్రణాళిక అంటూ ఆర్భాటంగా ప్రకటించి తదనంతరం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలో బుడమేరు ఆధునికీకరణ, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకేజీల వలన వరద ప్రవాహంపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. ‘సాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ సైతం ఇటీవల హెడ్ రెగ్యులేటర్‌ను, గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పడిన ప్రదేశంలో లైనింగ్ పనులకు గానూ రూ.39.77 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామంటూ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నిధులపై ప్రభుత్వం శుక్రవారం జీఓని విడుదల చేసింది.
చేయాల్సింది కొండంత...
బుడమేరుకు వచ్చిన వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువన అంటే బుడమేరు ప్రారంభం వరకు 42 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు కాల్వకు 80కి పైగా గండ్లు పడ్డాయి. వీటిని అధికారులు 65 పనులుగా నిర్ధారించి రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ గండ్లను శాశ్వతంగా పూడ్చడంతో పాటు ఆక్రమణలు తొలగించి బుడమేరుకు ఇరువైపులా కట్టలు బలోపేతం చేయాల్సి ఉంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఎడమ వైపు కట్టకు మూడు గండ్లు, కుడి వైపు కట్టకి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లను అప్పట్లో తాత్కాలికంగా పూడ్చారు. ఈ 11.90 కిలోమీటర్ల డైవర్షన్ కెనాల్‌ను 37,555 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచుతూ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం అర కిలోమీటరు లైనింగ్ పనులకు మాత్రమే నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు 13.25 కిలోమీటర్ల మేర ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని బుడమేరులో 202 ఎకరాలకు గానూ 70 ఎకరాల వరకు ఆక్రమణల చెరలో ఉన్న బుడమేరుకు ఆక్రమణలు తొలగించి మోక్షం కలిగించాల్సి ఉంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర బుడమేరుకు ఇరువైపులా గట్లను బలోపేతం చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మైలవరం నియోజకవర్గంలోని పులివాగు, కోతులవాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, ఎన్‌ఎస్‌పీ కాల్వలు, 32 చెరువులకు పడిన గండ్లకు శాశ్వతంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటికి గానూ రూ.30 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పనులకు నిధులు విడుదల చేయలేదు. ఈ పనులను చేపట్టకపోతే వచ్చే వర్షాకాలంలో పది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనా విజయవాడను మరోసారి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొంటే మరో ఉప్పెనను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రక్షాళనకు రూ.500 కోట్లు అంటూ రూ.39.77 కోట్లకు జీఓ విడుదల హెడ్ రెగ్యులేటర్‌కు ఎగువ బుడమేరు గండ్లకు విడుదల కాని నిధులు డైవర్షన్ కెనాల్ పూర్తి ఆధునికీకరణ ప్రశ్నార్థకమే వచ్చే ఏడాదీ వరద ముంపు తప్పదని ప్రజల ఆందోళన
నిధుల విడుదల ఇలా...
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం రూ.180 లక్షలను కేటాయించారు. డైవర్షన్ కెనాల్‌కు ఇరువైపులా కొండపల్లి శాంతినగర్ సమీపంలో పడిన గండ్ల వద్ద 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు అర కిలోమీటరు లైనింగ్ పనులకు గానూ రూ.3,797 లక్షలను కేటాయించారు. మొత్తంగా ఈ పనులకు రూ.39.77 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment