
దుర్గమ్మకు తామర పుష్పాలతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం అమ్మవారికి ఎర్ర తామర పుష్పాలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులతో విశేషంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి అర్చన నిర్వహించేందుకు సేకరించిన పుష్పాలను ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ వద్ద పూజలు చేపట్టారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని పూజా మండపం వద్దకు చేరుకున్నారు. ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్పార్చన నిర్వహించగా, పలువురు ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. పుష్పార్చనలో పాల్గొన్న ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.