
కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలను తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా జరిగింది. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత 10 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. సమ్మె కాలపు ఒప్పందాలపై జీవోలు జారీ చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ, సమ్మెకాలపు ఒప్పందాలపై జీవోలు ఇవ్వాలని ఈ నెల 17 వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సభ తీర్మానించింది. సంఘం అధ్యక్షుడు టి.నూకరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, రాష్ట్ర కోశాధికారి ఎస్.జ్యోతిబసు, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ధర్నాచౌక్‌లో మున్సిపల్ కార్మికుల ధర్నా