
దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు హారాన్ని భక్తులు శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన దేవినేని సురేంద్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్‌ను కలిసి బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.
వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం
● బిల్లును ఉపసంహరించుకునే వరకూ పోరాటం
● లబ్బీపేట మసీదు వద్ద ముస్లిం సంఘాల నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెచ్చిందని ముస్లిం సంఘాలు మండిపడ్డాయి, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే కుట్రలో భాగమే ఈ సవరణ బిల్లు అని వారు నినదించారు. లబ్బీపేటలోని మసీదులో శుక్రవారం నమాజు అనంతరం వందలాది మంది ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం జాక్ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ దేశంలోని 25 కోట్ల మంది ముస్లింలను మోసం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు ఐక్యతగా సోదరభావంతో నివసిస్తున్నా, వారి మధ్య అగాధం సృష్టించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం అనునిత్యం ముస్లింలను వేధించడమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ముస్లిం సంస్థల్లో ముస్లిమేతరులకు ప్రాధాన్యం కల్పించి వక్ఫ్ బోర్డును బలహీనపరిచేందుకు ఈ సవరణ బిల్లును తెచ్చారన్నారు. ఈ బిల్లును ఉపసంహరించే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ముస్లింలను మోసం చేశాయన్నారు. కార్యక్రమంలో ముక్తార్ అలి, అబిద్, ఎస్‌ఐఓ ప్రతినిధులు అమిర్ ఫాహెద్, అబ్దుల్ హఫీజ్, అమీర్ యహ్యా ఖాన్, అబ్దుర్రఖీభ్, కరీమ్ మొహిద్దీన్, మొహ్మద్ రియాజ్, ముసైబ పాల్గొన్నారు.
మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి
ఆర్‌డీఎంఏ నాగనరసింహారావు
పెనమలూరు: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరే విధంగా పన్నులు సకాలంలో వసూలు చేయాలని రీజినల్ డైరెక్టర్ అప్లేట్ కమిషనర్(ఆర్‌డీఎంఏ)సీహెచ్ నాగనరసింహారావు అన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మున్సిపల్ కమిషనర్‌లకు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఒక హోటల్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలపై కమిషనర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సకాలంలో పన్నులు వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే పనులు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో పాలన పారదర్శకంగా ఉండాలని, అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో సిబ్బంది పని తీరు మెరుగుపరిచే విధంగా కమిషనర్లు కసరత్తు చేయాలని అన్నారు. సమావేశంలో రెండు జిల్లాల మున్సిపల్ కమిషనర్‌లు, అధికారులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం

దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం