
మచిలీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న ఐదుగురిని చిలకలపూడి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిలకలపూడి సీఐ ఎస్‌కే నబీ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం ఆనంద్‌పేటకు చెందిన ఉదయ్‌కుమార్ హైదరాబాద్‌లో ఉంటూ మూడు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. ఉదయ్‌కుమార్, బుట్టాయిపేటకు చెందిన షేక్‌రియాజ్, బందరు మండలం నవీన్‌మిట్టల్‌కాలనీకి చెందిన గోపీ, ముస్తాఖాన్‌పేటకు చెందిన బలగం నాగరాజు, కాగి జస్వంత్‌లు శనివారం ఉదయం మాచవరం మెట్టు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిలకలపూడి స్టేషన్ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారణ చేయగా ఐదుగురు గంజాయి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 25.62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగరాజు ద్విచక్ర వాహనంతో పాటు ఉదయ్‌కుమార్ కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వీటితో పాటు వారి నుంచి 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ గంగాధరరావు ఆదేశాల మేరకు మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయి కేసులో లోతైన దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బందరు డీఎస్పీ రాజా ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టీమ్‌లు పనిచేస్తున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయాలకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా నేరుగా తమకు తెలియజేసి గంజాయి నిర్మూలనకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ యుఎల్ సుబ్రహ్మణ్యం, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
25.65 కేజీల గంజాయి స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
బైక్, కారును సీజ్ చేసిన
చిలకలపూడి పోలీసులు

మచిలీపట్నంలో భారీగా గంజాయి పట్టివేత