
నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి
గుణదల(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదలలోని రామ్స్ థియేటర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. మల్లేశం, మెట్రో వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో 23 పేరుతో చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. విభిన్నమైన పాత్రలతో కథనం నడుస్తుందని చెప్పారు. దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. 1990 దశకంలో చిలకలూరి పేట ప్రాంతంలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింప చేసే విధంగా ఉంటాయని తెలిపారు. కథాంశంలోని బస్సు ప్రమాదంలో సుమారు 20–23 మధ్య వయసు గల యువకులు మరణించారని అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టామన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ తన్మయ పాల్గొన్నారు.
పనిచేసే కంపెనీకి
రూ.40 లక్షల టోకరా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పనిచేస్తున్న కంపెనీని మోసం చేసిన వ్యక్తిపై భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... భవానీపురంలోని డనకన్స్ టీ కంపెనీలో చింత విశ్వేశ్వరరావు డిపో ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. కంపెనీ గోడౌన్‌లోకి వచ్చే రుజువు చూసుకోవడం, ధ్రువీకరించడం, కంప్యూటర్‌లో ఎంటర్ చేయడం అతని బాధ్యత. ఉత్పత్తులను కంపెనీ డిస్ట్రిబ్యూటర్లకు పంపి ఇన్‌వాయిస్‌లు తయారు చేస్తాడు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరి రిపోర్టులు హెడ్ ఆఫీసులో పరిశీలించగా 4.8 టన్నుల సరుకు తేడా వచ్చింది. దీనిపై విశ్వేశ్వరరావును వివరణ కోరగా సరిచేస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మరలా సరుకు తేడా గురించి ప్రశ్నించగా మోసానికి పాల్పడినట్లు అంగీకరిస్తూ కంపెనీకి లేఖ రాశాడు. అనంతరం ఫిజికల్ ఆడిట్ రిపోర్టు పరిశీలించగా 11 టన్నులు సుమారు రూ.40 లక్షల విలువగల సరుకు తేడా వచ్చింది. జోనల్ అకౌంటెంట్ సరుకులో ఎందుకు వ్యత్యాసం వచ్చిందని అడగ్గా దుర్వినియోగం చేసినట్లు అంగీకరిస్తూ కంపెనీకి మరో మెయిల్ పంపాడు. కంపెనీలో రూ.40 లక్షల విలువైన సరుకును తేడా చేసి మోసం చేశాడు. దీనిపై కంపెనీ ఏరియా బిజినెస్ మేనేజర్ అరిగెల వెంకట సత్య వరప్రసాద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.