
ఫలించిన లక్ష్యం.. మెరిసిన మత్స్యం
తిరువూరు: ఇంటర్మీడియెట్ విద్యలో గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితం ఇప్పుడు ప్రతిబింబిస్తోంది. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఫలించాయని ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మరోమారు నిరూపించాయి. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు సంవత్సరాలుగా స్టేట్ టాప్ ర్యాంకర్లను అందించింది. గతేడాది ఆదూరి స్వప్న హెచ్‌ఈసీ గ్రూపులో 912 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు పురస్కారానికి ఎంపికై ంది. ఈ ఏడాది ఇదే కళాశాలలో ఫిషరీస్ ఒకేషనల్ గ్రూపు విద్యార్థిని పింగళి ప్రత్యూష 964 మార్కులు సాధించి మరోసారి రాష్ట్రస్థాయిలో కళాశాలకు పేరు తెచ్చింది.
అకుంఠిత దీక్షతో ఆశయసాధన
నిరుపేద కుటుంబానికి చెందిన ప్రత్యూష పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక కోవిడ్ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయింది. ఆమె సొంత ఊరు అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం. ఆ గ్రామంలో పదో తరగతి పూర్తయిన తదుపరి బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియెట్ చదవడానికి ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. తల్లి చిన్నతనంలోనే మరణించగా తండ్రి రెక్కల కష్టంతో చదివిస్తుండటంతో ఎలాగైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ప్రత్యూష మళ్లీ ఇంటర్మీడియెట్‌లోనే చేరాలని నిర్ణయించుకుంది. ఫిషరీస్‌లో చదువుకోవాలన్నది ఆమె లక్ష్యం. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కోర్సు ఉండటం, వసతి గృహం కూడా అందుబాటులో ఉందని గుర్తించింది. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో ఫిషరీస్ కోర్సు తీసుకుంది. తన సోదరి ప్రోత్సాహంతో తిరువూరు కళాశాలలో చేరి ఇక్కడే బాలికల ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువు కొనసాగించింది. కళాశాలలో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తుండటంతో ఆ బాలికపై కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్టేట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో బాలికకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000కి 964 మార్కులు సాధించడంలో తోడ్పాటు అందించారు.
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన ప్రత్యూష ఒకేషనల్ ఫిషరీస్ కోర్సులో 1000కి 964 మార్కులు విద్యారంగంలో గత ప్రభుత్వ సంస్కరణల ఫలితం

ఫలించిన లక్ష్యం.. మెరిసిన మత్స్యం